రష్యా నుండి 33 యుద్ధ విమానాలు 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రూ.38,900 కోట్ల విలువైన ఒప్పందాలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ నేతృత్వంలోని రక్షణ సమీకరణ మండలి(డిఎసి)  ఆమోదం తెలిపింది. తద్వారా 33 యుద్ధ విమానాల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. 
 
ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి భారత నావికాదళానికి (ఐఎఎఫ్‌) 21 మిగ్‌-29 యుద్ధ విమానాలను సమకూర్చడంతో పాటు ఇప్పటికే ఉన్న 59 విమానాలను ఆధునీకరణ చేయనున్నారు. హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) నుంచి 12 ఎస్‌యూ- 30 ఎంకెఐ విమానాలను కూడా సమకూర్చుకోనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
రాజ్‌నాధ్‌ సింగ్‌ ఇటీవల రష్యా పర్యటకు వెళ్లివచ్చిన నేపథ్యంలో ఈ ఆమోదం రావడం గమనార్హం. అక్కడ విక్టరీ డే పెరేడ్‌లో పాల్గన్న రక్షణ రంగంలో సహకారంపైనా చర్చించారు. రష్యాలో రాజ్యాంగ సవరణలకు సంబంధించిన దేశవ్యాప్త ఓటింగ్‌లో విజయం సాధించినందుకు ఆ దేశ ఆధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఒక సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
 
డిఎసి ఆమోదం పొందిన ఒప్పందాల్లో ఆర్మీకి సంబంధించి పినామా మందుగుండు సామగ్రి సరఫరా, సాయుధ వాహనమైన బిఎంపి ఆయుధ నవీకరణలు, సాఫ్ట్‌వేర్‌ డిఫైన్‌డ్‌ రేడియో(ఎస్‌డిఆర్‌), నేవీ, ఎయిర్‌పోర్సులకు ఉపరితలం నుంచి ఉపరితలంలో వెయ్యి కిలోమీటర్ల దూరం మేర సామర్ధ్యం కలిగిన ధీర్ఘశ్రేణి క్షిపణులు, గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను కూల్చగలిగే అస్త్ర బియాండ్‌ విజువల్‌ రేంజ్‌(బివిఆర్‌)లు ఉన్నాయి. 
 
దాదాపు రూ.31,130 కోట్ల అంచనా విలువైన ఆయుధాలను దేశీయంగా కొనుగోలు చేయనున్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసే విమానాలు, ఇతర ఆధునీకరణకు రూ.7,418 అంచనా వ్యయం, ఎస్‌యూ-30 ఎంకెఐ విమానాలకు రూ.10,730 వ్యయం చేయనున్నారు.