వచ్చే అక్టోబర్, నవంబర్‌లలో బీహార్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్‌ను పెట్టింది. కరోనా మహమ్మారి కారణంగా కీలక నిర్ణయం తీసుకొంది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులకు దాని ముప్పు ఎక్కువని చెబుతున్న నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, కరోనా అనుమానితులు, క్వారంటైన్‌లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్‌ను వాడుకొనేలా రూల్స్ మార్చింది.
దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ రూల్స్, 1961లోని పలు క్లాజ్‌లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరికి ఇవ్వొచ్చన్న దానికి సంబంధించి రూల్ – 27(ఏ)లోని వేర్వేరు క్లాజుల్లో పొందుపరిచి ఉంది.
వాటిలో ఉన్న దివ్యాంగులు అన్న పదానికి అదనంగా కరోనా అనుమానితులు, పాజిటివ్ వచ్చిన పేషెంట్లు, క్వారంటైన్‌లో ఉన్నవారు అన్న పదాలను, 80 ఏళ్ల వయసు అన్న పదం ప్లేస్‌లో 65 ఏళ్లు అని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమీషన్ తెలిపింది.
ఇప్పటి వరకు 80 ఏళ్లు పైబడినవారికి, ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు, విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వీలుంది
మార్చిలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా జూన్‌కు వాయిదా వేశారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వాయిదా ప్రకటన రాలేదు.
More Stories
జార్ఖండ్ నుండి చొరబాటుదారులను తరిమికొడతాం
25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
యోగిని చంపివేస్తామని బెదిరింపు .. ఓ యువతి అరెస్ట్