కోర్టుల జోక్యంపై స్పీకర్ తమ్మినేని అసహనం 

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో కోర్టుల జోక్యం ఎక్కువన్నది అంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది.

రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్నాను కాబట్టి తాను ఏ వ్యాఖ్యలు చేసినా రక్షణ ఉంటుందనే అహంభావంతో న్యాయ వ్యవస్థ, శాసన మండలి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, తదితర రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విశ్వాసం లేకుండా చేయడమే లక్ష్యంగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

‘కోర్టులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే.. ప్రభుత్వమెందుకు.. ప్రజలెందుకు.. ఎన్నికలెందుకు..’ ప్రశ్నించారు. పైగా, కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, కాణిపాకం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న సందర్భంగా ఈ వివాదాస్పద వాఖ్యలు చేయడం గమనార్హం. 

‘ఈ విధంగా చేయి.. నువ్విక్కడకు వెళ్లు.. ఇది స్టాప్‌ చేయి.. అని చెబుతుంటూ ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు… ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టం ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్‌ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

`50 ఏళ్లుగా చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మా నిర్ణయాలు తప్పయితే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు. ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలు అడ్డుకోవడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ఠ’ అంటూ తీవ్రమైన వాఖ్యలు చేశారు. 

రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను నిర్ణయించిన్నట్లు గుర్తు చేస్తూ .ఒకరి పరిధులను మరొకరు అతిక్రమించకుండా, ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలని సీతారాం హితవు చెప్పారు. “మరి కోర్టుల నుంచే ఆదేశాలు వస్తే.. ప్రభుత్వ పాలసీల్లో కోర్టులే జోక్యం చేసుకుంటే.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలెందుకు? ప్రజలు ఎన్నుకోవడం దేనికి?” అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వాన్ని న్యాయస్థానాలే నడిపిస్తాయా..? కోర్టుల నుంచే పరిపాలన సాగిస్తారా..? ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే అంటూ విమర్శించారు. బాధతోనే కోర్టు తీర్పులను అంగీకరిస్తున్నామని చెప్పారు.