ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వైద్య వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్తంగా వెల్లడించాయి.
క్రియారహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, నేడో, రేపో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నది.
కాగా, క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 12 సంస్థలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు తొలివారం నాటికి పూర్తవుతాయని తెలిపాయి.
ఈ విషయాన్ని ఐసీఎంఆర్, తన భాగస్వాములందరికీ తెలియజేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసిన ఐసీఎంఆర్, ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్ కు సన్నద్ధమవ్వాలని సూచించింది. త్వరితగతిని ట్రయల్స్ ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.
దీన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కోరింది. ఈ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్, పూణెలోని వైరాలజీ ల్యాబ్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసింది.
కాగా, వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పూర్తి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య రంగంలోని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
లక్ష్యాలను చేరుకునేందుకు బీబీఐఎల్ చేస్తున్న కృషిని అభినందిస్తూనే, ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
More Stories
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత