యాజమాన్యం తప్పిదంతోనే గ్యాస్ లీకేజి 

విశాఖలోని పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ లీకేజీ ఘటనకు యాజమాన్య తప్పిదమే కారణమని కలెక్టర్‌ నియమించిన విచారణ కమిటీ ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం, నలుగురు అస్వస్థతకు గురి కావడం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో నియమించిన కమిటీ విచారణ చేసి కలెక్టర్‌కు వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురి నుంచి ఈ కమిటీ బుధవారం స్టేట్‌మెంట్‌ తీసుకున్నది. సాంకేతిక కారణాల వల్లగానీ, పొరపాటు వల్లగానీ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రత తగ్గించే సిస్టంను ఏర్పాటు చేయాల్సి ఉంది. 
 
కానీ, ‘సాయినార్‌’ కంపెనీలో అటువంటి స్క్రబ్బింగ్‌ సిస్టం లేదని తెలిసింది. విషవాయువులు ఒకేసారి విడుదలైనా ప్రాణహాని జరగకుండా ఎయిర్‌లైన్‌ మాస్క్‌లు ఎంతో ఉపయోగపడతాయి. విషవాయువుల నుంచి కాపాడే ఈ మాస్క్‌లను కార్మికులకు ఇచ్చి ఉంటే ఇద్దరి ప్రాణాలు పోయేవి కావు. 
 
కంపెనీలో యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని కమిటీ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది. మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందంటూ ప్రమాదాన్ని కార్మికులపైకి నెట్టి తప్పించుకొనే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నట్లు కనబడుతోంది. 
 
ప్రమాదానికి యాజమాన్యం తప్పిదాలు కన్పించడంతో నివేదిక అనంతరం కేసు నమోదు చేయవలసి ఉంది. అయితే, ఎల్‌.జి.పాలిమర్స్‌ యాజమాన్యంపై కేసులు పెట్టి అరెస్టు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్లు, ఇక్కడ కూడా యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నం మరోవైపు జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మంగళవారం నుంచి ఇప్పటివరకు జరిగిన చర్చల్లో యాజమాన్యం మృతుల కుటుంబానికి రూ.35 లక్షల నష్టపరిహారం, రూ.10 లక్షలు బీమా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది.