అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌లో హైడ్రామా  

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నేత కె అచ్చెన్నాయుడును బుధవారం సాయంత్రం హడావుడిగా డిశ్చార్జ్‌ చేసి, విజయవాడలోని సబ్ జైలుకు తరలించడంలో హైడ్రామా నెలకొంది. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వైద్యుల కమిటీ తెలిపినా కమిటీపై ఒత్తిడి పెంచి డిశ్చార్జ్ రాయించరనే  విమర్శలు చెలరేగుతున్నాయి. 

వైద్య విద్య డైరెక్టర్ బుధవారం మధ్యాహ్నం నుంచి జీజీహెచ్‌లోనే ఉం, వైద్యుల దినోత్సవంనాదే ఒత్తడి చేయడంతో వైద్యులు తలొగ్గారని చెబుతున్నారు. అచ్చెన్నాయుడును ఆస్పత్రి లోపలి నుంచి వీల్‌చైర్‌లో తీసుకొచ్చి అంబులెన్స్‌లో విజయవాడకు తీసుకెళ్లారు.

టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపినా పోలీసులు పట్టించుకోలేదు. మరోవంక, జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తనకు కరోనా టెస్ట్ చేయాలని కోరారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని, కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో అచ్చెన్న విజ్ఞప్తి చేశారు.

 జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడును బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  ఖండించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నను బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారని ఆయన మండిపడ్డారు. తప్పుడు సమయం వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమన్నారు. 

అచ్చెన్నాయుడిని గ‌త నెల‌లో ఏసీబీ అధికారులు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసే నాటికి రెండ్రోజుల ముందే ఆయ‌న పైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఉండ‌డంతో శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు సుదీర్ఘ ప్ర‌యాణం వ‌ల్ల గాయం తీవ్ర‌మైంది. 

దీంతో ఆయ‌న‌కు 14 రోజుల‌ జుడిషియ‌ల్ రిమాండ్ విధించిన కోర్టు మెరుగైన వైద్యం అందించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. గుంటూరు జీజీహెచ్‌లో ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు మ‌రోసారి ఆప‌రేష‌న్ చేశారు.

 ఆయ‌న‌ను గ‌త వారం కోర్టు ఏసీబీ క‌స్ట‌డీకి ఇవ్వ‌డంతో ఆస్ప‌త్రిలోనే ఉంచి మూడ్రోజుల పాటు విచారించారు. అయితే ఆయ‌న జుడిషియ‌ల్ రిమాండ్ ముగియ‌డంతో కోర్టు జూలై 10 వ‌ర‌కు రిమాండ్ పొడిగించింది. 

 అచ్చెన్నాయుడికి జీజీహెచ్‌లో వైద్యం స‌రిగా అంద‌డం లేద‌ని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని కొద్ది రోజులుగా టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అకస్మాత్తుగా ఆయ‌న్ని జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.