న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం రైల్వే లైన్ పూర్తి 

నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణంలో తొలిదశ పనులు పూర్తయ్యాయి. న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం మధ్య 47 కిలోమీటర్లు దూరానికి పనులు పూర్తి కావడంతో కార్యకలాపాలు నిర్వహించేందుకు రైల్వే శాఖ అనుమతులిచ్చింది. 
 
ఈ మార్గం అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్‌, నల్లపాడు జంక్షన్ల నుండి న్యూ పిడుగురాళ్ల ద్వారా డోన్‌ వైపు నేరుగా రైళ్లు నడపడానికి వీలు కలుగుతుంది. నల్లపాడు మార్గంతో పోలిస్తే సికింద్రాబాద్‌ – డోన్‌ మధ్య నడికుడి ద్వారా 96 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కీలకమైన ఈ ప్రాజెక్టును ఐదు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
మొదటి దశలో పిడుగురాళ్ల – శ్యావల్యాపురం 47 కిలో మీటర్లు, రెండవ దశలో గండ్లకమ్మా- దర్శి 27 కిలో మీటర్లు, మూడవ దశలో దర్శిా -కనిగిరి 52 కిలో మీటర్లు, వెంకటగిరి – అల్టూరిపాడు 15 కిలో మీటర్లు,నాల్గవ దశలో కనిగిరి- పామూరు 35 కిలో మీటర్లు, అల్టూరిపాడు – వెంకటాపురం 43 కిలో మీటర్లు, ఐదో దశలో పామూరు – ఓబులాయపల్లి – వెంకటాపురం 90 కిలో మీటర్లు నూతన రైల్వే లైన్‌ వేసే విదంగా ప్రణాళికను సిద్ధం చేశారు.
దీనిలో మొదటి దశ పనులు పూర్తికావడంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు గజాననమాల్యా గుంటూరు డివిజన్‌ అధికారులు, నిర్మాణసంస్థ అధికారులకు అభినందనలు తెలిపారు.