మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టారు 

నెల్లూరు ఏపీ టూరిజం డివిజనల్‌ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. మాస్క్‌ ధరించాలని సూచించిన దివ్యాంగురాలైన ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్ దాడి చేశాడు. జుట్టుపట్టుకుని కుర్చీలోంటి లాగి చితక్కోట్టాడు.
 
భాస్కర్‌ కార్యాలయానికి రాగానే అక్కడే ఉన్న ఉషారాణి మాస్క్‌ పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన భాస్కర్‌ ఆమెపై దాడి చేశాడు. పక్కనే ఉన్న తోటి ఉద్యోగులు ఆపేందుకు యత్నించినప్పటికీ.. భాస్కర్‌ విచక్షణా రహితంగా కొట్టాడు. కుర్చీ హ్యాండిల్ విరగొట్టి దాంతో. ఆమె తలపై దెబ్బమీద దెబ్బ వేసాడు.
అయినా విడిపించుకుని మహిళ జట్టుపట్టుకుని పదేపదే దెబ్బలు వేశాడు. కొంతకాలంగా ఉద్యోగినులపై భాస్కర్ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శాఖ ఖర్చులు తగ్గించుకునేందుకు పలువురిని ఉద్యోగాలు మానేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌పై కేసు నమోదు అయింది. దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో భాస్కర్ రావు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి ఉదంతం ఉన్నతాధికారులకు చేరడంతో వారు భాస్కర్ రావుపై సీరియస్ అయ్యారు.  

దివ్యాంగ ఉద్యోగినిపై దాడి ఘటనపై టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగ ఉద్యోగినిపై హత్యాయత్నానికి పాల్పడ్డ భాస్కర్‌ని సస్పెండ్ చేస్తూ ఏపీ టూరిజం శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనుమతి లేనిదే జిల్లా కేంద్రం వదిలివెళ్లొద్దని భాస్కర్‌కి ఆదేశించారు.

అలాగే మహిళా ఉద్యోగిపై దాడి చేయడాన్ని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా తీవ్రంగా ఖండించారు. నెల్లూరు వెళ్లి బాధితురాలు ఉషారాణిని పరామర్శించారు. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భాస్కర్‌ ప్రవర్తించారని మండిపడ్డారు.