విశాఖలో మరో గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి

విశాఖలో మరో గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో వరుస గ్యాస్ లీకేజ్ ఘటనలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖలో ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం పరవాడలోని ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. 

సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో బెంజి మిడజోల్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,  మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే గాజువాకలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతులను షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర కెమిస్ట్ గౌరీశంకర్‌లుగా గుర్తించారు. 

ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గ్యాస్ లీకేజీ ఓ విభాగానికే పరిమితమని అధికారులు చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.