తాను పార్టీకి, పార్టీ అధినేతకు విధేయుడిని అంటూనే ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీలతో నేడు లేఖ వ్రాసారు.
గత వారం పార్టీ ప్రధాన కార్యదర్శి జారీచేసిన షో కాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఇచ్చిన గడువు వారం రోజులు నేడు ముగియనుండటంతో నేరుగా పార్టీ అధ్యక్షుడిగా సమాధానం పంపారు. పైగా, సీ ఓటర్ సర్వేలో ఉత్తమ సీఎంగా 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలుపుతూ లేఖను ప్రారంభించారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి ఎవరంటూ నిలదీశారు. నమోదయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్‌తో నోటీసు అందిందని ఆరోపించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని, పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన జగన్ కు గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని కూడా వెల్లడించారు.
ఈ సందర్భంగా తనను కలిసే అవకాశం ఇవ్వాల్సిందిగా మరోసారి ముఖ్యమంత్రిని అభ్యర్ధించారు. సిఎం చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు తనను క్రిస్టియన్ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చూస్తున్నారని, వారే తనను సిఎం దగ్గరికి రానివ్వకుండా అడ్డుపుడుతున్నాని ఆ లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేసారు.
తాను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడునని, టిటిడి ఆస్తులను వేలం వేయడానికి తను అడ్డు చెప్పానని, ప్రజా అభిప్రాయం కూడా అదేనని స్పష్టం చేశారు. అంతే తప్ప తాను సిఎంను కానీ, పార్టీని కాని ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు.
తాను ఎప్పుడూ పార్టీకి విధేయుడినేని అని పేర్కొంటూ ఇసుక విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అది కుదరకపోవడంతో మరో మార్గం లేక మీడియాతో చెప్పానని చెప్పుకొచ్చారు.
More Stories
సిఆర్డిఏ పరిధిని పునరుద్ధరించిన ఏపీ మంత్రివర్గం
టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన బీఆర్ నాయుడు
అమరావతి పాత టెండర్లు రద్దు