పొగాకు మార్కెట్ పట్ల ఎటువంటి అనుభవం, మౌలిక సదుపాయాలు లేని మార్క్‌ఫెడ్‌ను పొగాకు కొనుగోలుకు జులై 1 నుండి మార్కెట్ లోకి దింపాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం పట్ల పొగాకు రైతులు విస్మయం చెందుతున్నారు.
పొగాకు ధర పడిపోయినప్పుడు పొగాకు కొనవలసిన బాధ్యత గల పొగాకు బోర్డు ఒక వంక, పొగాకు రైతులతో కూడిన పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఉండగా వారితో కొనుగోలు చేయించే ప్రయత్నం చేయకుండా ఈ విధంగా చేయడం రైతులకు మేలు చేకుర్చబోదని ఆందోళన చెందుతున్నారు.
గత వారం పొగాకు రైతుల సమస్యలపై రైతు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో జరిపిన సమావేశంలో పొగాకు కొనుగోలుకు ఓ అధికారితో సంస్థను ఏర్పాటు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై సీఎంను పొగాకు వ్యాపారులు తప్పుదోవ పట్టించి, చౌక ధరకు పొగాకును కొనుగోలు చేయడానికి పధకం వేస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.
వేలంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య మాత్రమే గతంలో పాల్గన్నేది. పొగాకు రైతులు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. దీనికి పాలకవర్గం కూడా ఉంది. అయితే ఇప్పుడు సమాఖ్య రంగంలోకి దిగితే వ్యాపారులకు ఇబ్బంది వస్తుంది. పోటీ పెరుగుతుంది.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమకు రూ.100 కోట్లు నిధులతో పాటు కొన్ని వేలం కేంద్రాలు కేటాయించాలని సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదే జరిగితే వ్యాపారులు దిగిరాక తప్పదు. దీంతో పొగాకు వ్యాపారులు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఈ సమాఖ్య పాల్గొనకుండా చేస్తున్నట్లు తెలుస్తున్నది. పొగాకు బోర్డు కూడా ఇందుకు సహకరించిన్నట్లు అనుమానాలు చెలరేగుతున్నాయి.
సిఎం జగన్‌కు కూడా ఉన్నతాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించిన్నట్లు తెలుస్తున్నది. మార్క్‌ఫెడ్ ఇప్పటివరకూ పొగాకు కొనలేదు. ఏమీ తెలియని మార్క్‌ఫెడ్ రంగంలోకి వస్తే వ్యాపారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు