తనపై దాడి జరిగినట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం ఉదయం ఉత్తర 24 పరగణాలులోని టీ స్టాల్ వద్ద బిజెపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన `చాయి పే చర్చ’ కార్యక్రమానికి వెడుతున్నప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డగించి తనపై దాడి చేసినట్లు ఆయన చెప్పారు.
తనను కాపాడబోయిన సెక్యూరిటీ గార్డులను టీఎంసీ కార్యకర్తలు కొట్టారని, తన కారును స్వల్పంగా ధ్వంసం చేశారని ఆరోపించారు. టీఎంసీ ఎందుకు తన గురించి భయపడుతున్నదో తనకు అర్థం కావడంలేదని దిలీప్ ఘోష్ విస్మయం వ్యక్తం చేశారు.
తీరా టి స్టాల్ వద్దకు చేరుకోగా అక్కడ విరిగిన కుర్చీలు దర్శన మిచ్చాయని చెప్పారు. తన రాక గురించి స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులను ఈ సంఘటన వెల్లడి చేస్తుందని విమర్శించారు.
ఈ దాడిని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజాన్ చౌదరి తీవ్రంగా ఖండించారు. అందరు బీజేపీ, టి ఎంసీ సిద్ధాంతాలను ఒప్పుకొనక పోవచ్చని, కానీ ఈ విధమైన దాడులు ఆమోదయోగ్యం కాబోవని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ధీమాతో ఉన్నది.
మరోవైపు రెండు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో తన పట్టు కోల్పోకుండా ప్రయత్నిస్తున్నారు. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి నేతలపై, కార్యకర్తలపై రాష్ట్రంలో తరచుగా దాడులు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో సీఎం మమత విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం