కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకూ లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా ‘అన్‌లాక్ 2’కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న సడలింపులతో కూడిన లాక్‌డౌన్ జూలై 31 వరకూ యధావిధిగా అమలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. 

జూలై 31 వరకూ కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలవుతుందని, కట్టడి ప్రాంతాల్లో కేవలం నిత్యావసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా జూలై 31 వరకూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా మందిరాలకు జూలై 31 వరకూ అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మరోవైపు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. అన్‌లాక్‌పై ఆయన ప్రసంగించే అవకాశముంది.