చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు  

చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు  
ప్రస్తుతం  వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తత సడలినప్పటికీ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) మోహరించిన మార్షల్‌ ఆర్ట్స్ దళానికి దీటుగా భారత్‌ ఘాతక్‌ కమాండోలను దింపింది. 
 
సరిహద్దులో భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు చైనా మార్షల్ ఆర్ట్స్ బోధకులను తీసుకొచ్చింది. 20 మంది మార్షల్ ఆర్ట్స్ బోధకుల నేతృత్వంలో టిబెట్‌లో సైనికులకు శిక్షణ అందించింది. గల్వాన్ లోయలో ఘర్షణలకు ముందే టిబెట్‌లోని స్థానిక క్లబ్‌ల నుంచి స్థానిక మార్షల్ ఆర్ట్స్ బోధకులను చైనా తన సైన్యంలోకి చేర్చుకున్నది. 
 
వీరిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం తన ప్రాణాంతక కమాండోలను రంగంలోకి దింపినట్లు సమాచారం. కర్ణాటకలోని బెల్గాం పట్టణ శివారులోని శిబిరంలో ఘాతక్‌ కమాండోలకు 43 రోజుల ప్రత్యేక కమాండో శిక్షణా కోర్సును పూర్తి చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రాణాంతక కమాండోలు శిక్షణలో భాగంగా 35 కిలోల బరువు ఎత్తడం, 40 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా నడవడం వంటి కఠిన శిక్షణ ఉంటుంది. 
 
ఇక్కడి శిక్షణలో వారు శారీరకంగా బలంగా తయారవడమే కాకుండా ప్రత్యేక ఆయుధాల శిక్షణ, పోరాట శిక్షణ అందిస్తారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందినవారై ఉంటారు. ఘాతక్ కమాండోలు శత్రువు చుట్టూ తిరగడానికి, బెటాలియన్ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు అవసరం లేకుండానే దాడి చేయడంలో శిక్షణ పొందుతారు. ఆయుధంతోపాటు ఆయుధం లేకుండా కూడా పోరాడటంలో వీరు నైపుణ్యం కలిగివుంటారు. 
 
ఘాతక్ కమాండోలు శత్రువుల ఫిరంగి స్థావరాలు, వాయు క్షేత్రాలు, డంపింగ్‌ కేంద్రాలు, ప్రధాన కార్యాలయాలపై ప్రత్యక్ష దాడులకు దిగుతారు. ఫిరంగి, వైమానిక దాడులను చేపట్టడం వంటి  యుద్ధకళల్లో కూడా వీరు ఆరితేరివుంటారు. హెలిబోర్న్ దాడి, పర్వత యుద్ధం, రాక్ క్లైంబింగ్, కూల్చివేతలు, క్లోజ్ క్వార్టర్ యుద్ధాలు, పరిపాలనా మరియు రవాణా పాత్రల్లో కూడా శిక్షణ పొందుతారు.
 
ఒక ఘాతక్ ప్లాటూన్‌లో సాధారణంగా 20 మంది ఉంటారు. ఇందులో కమాండింగ్ కెప్టెన్, ఇద్దరు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, మార్క్స్ మాన్, స్పాటర్ జోడీలు, లైట్ మెషిన్ గన్నర్స్, మెడిసిన్, రేడియో ఆపరేటర్ వంటి వారు ఉంటారు. ఈ కమాండోలు టావర్ టిఎఆర్-21, ఇన్సాస్, ఎకె-47 వంటి రైఫిల్లను కలిగి ఉంటారు. షూటర్లు డ్రాగునోవ్ ఎస్వీడి రైఫిల్, హెక్లర్ & కోచ్ ఎంఎస్జీ-90 స్నిపర్ రైఫిల్స్ కలిగివుంటారు. 
 
మిషన్‌ను అనుసరించి తాడులు, క్లైంబింగ్ గేర్, గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లు, లేజర్ టార్గెట్ డిజైనర్లు, నైట్ విజన్ పరికరాలు వంటివి తీసుకెళ్తారు. ఈ ప్రాణాంతక యూనిట్ ఒక్కసారిగా శతృవుపై దాడి చేసి శతృవును ఆశ్చర్యపరుస్తుంది. వీరి దాడిరీతులు చాలా అనూహ్యమైనవిగా ఉంటాయి. శతృవులకు కోలుకునేందుకు కూడా అవకాశం లభించకుండా దాడికి దిగుతారు.