
Hyderabad: Only a few commuters on a road near Charminar during ongoing COVID-19 lockdown in Hyderabad, Tuesday, May 26, 2020. (PTI Photo)(PTI26-05-2020_000163A)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా హద్దు మీరు కేసుల సంఖ్య 10,000కు దాటి పోవడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అప్రమత్తమైన్నట్లు తెలుస్తున్నది. మరో పక్షం రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ ప్రకటించడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిపినప్పుడు ఈ సంకేతం ఇచ్చారు.
హైదరాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. మంత్రివర్గ సమావేశం జరిపి, అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా వీటిలో ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే 10,150 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇప్పటికే 243 మంది చనిపోగా వీరిలో 206 మంది హైదరాబాద్ వాసులే కావడం గమనార్హం.
ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్లలో హోల్ సేల్ వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారవేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ జనరల్ బజార్ పరిసర వ్యాపార ప్రాంతాలన్నిటిలోనూ పూర్తి స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటించాలని వ్యాపారులే నిర్ణయించారు.
కొద్దిపాటి ఉద్యోగులతో కార్యాలయాలను ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు తిరిగి పూర్తిగా మూసివేయడం మొదలుపెట్టాయి. దిల్‌సుఖ్ నగర్‌లోని వెంకటాద్రి షాపింగ్ మార్కెట్ అసోసియేషన్ వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. సోమవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దుకాణాలు బంద్ చేయనున్నట్లు అసిసోయేషన్ వ్యాపారులు ప్రకటించారు.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ సొరంగం బహిర్గతం