లడఖ్ ప్రాంతంలో ఎవరైతే మనకు ఛాలెంజ్ విసిరారో వారికి తగిన విధంగా దీటైన జవాబునే ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయంలో మన భారత జవాన్లు అత్యున్నతమైన త్యాగం చేశారని, విరోధులను మాత్రం విజయం సాధించనివ్వలేదని ప్రశంసించారు.
జవాన్లను కోల్పోయినందుకు తామెంతో బాధ పడుతున్నామని ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి శౌర్యమే దేశానికి కొండంత అండ అని ఆయన పేర్కొన్నారు. రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్‌కు బాగా తెలుసని పరోక్షంగా చైనా విషయాన్ని ప్రస్తావించారు. పొరుగు దేశాలతో తలెత్తిన సరిహద్దు తగాదాలను పరిష్కరించే సామర్థ్యం భారత దేశానికి సంపూర్ణంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ సంవత్సరంలో ఆంఫన్, కరోనా వైరస్, లడఖ్ పరిస్థితులు వంటి అనేక సమస్యలు దేశాన్ని చుట్టు ముట్టాయని, అయితే ఇన్ని జరిగినా ఈ సంవత్సరాన్ని ‘చెడ్డ సంవత్సరం’’ అని ముద్ర వేయవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరాన్ని ఉత్తమం చేయడానికి భారత పౌరులందర్నీ ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్నేహితులను ఎలా చూడాలో దేశానికి బాగా తెలుసని, అదే సమయంలో శత్రువులను ఎలా చూసుకోవాలో అంతకంటే బాగా తెలుసని పరోక్షంగా చైనాను హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, ఐక్యతను నెలకొల్పే విషయంలో భారత్ మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలను సడలించామని, ప్రజలు మాత్రం అత్యంత జాగరూకతతో ఉండాలని కోరారు. రెండు గజాల దూరం పాటించడంతో పాటు, మాస్కులను కూడా ధరించాలని ఆయన సూచించారు. ఇలా పాటించకుంటే.. తమని తాము ఉపద్రవంలోకి నొట్టేసుకోవడమే కాకుండా మిగితా వారిని కూడా నెట్టేసిన వారౌతారని సున్నితంగా హెచ్చరించారు.
వలస కూలీలకు సంబంధించి ఉత్తేజకరమైన కథలను వింటూనే ఉన్నామన్నారు. యూపీలోని బారాబంకిలో వలస వచ్చిన కార్మికులు కల్యాణి నది సహజ రూపాన్ని పునరుద్ధరించడానికి పని ప్రారంభించారని, తమ చుట్టూ ఉన్న విషయాలను మారుస్తున్న విధానం అత్యంత ప్రశంసనీయమని మోదీ పేర్కొన్నారు.
భారత్ అన్‌లాక్ అవుతోందని, వివిధ రంగాల్లో భారత్‌ను ‘స్వావలంబన’ దిశగా తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని మోదీ పిలుపునిచ్చారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు