కరోనా కట్టడిలో యోగి కృషి భేష్

The Prime Minister, Shri Narendra Modi interacting with the various beneficiaries and stakeholders, at the inauguration of ‘Aatma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan’ through video conferencing from New Delhi on June 26, 2020.

కరోనా కట్టడిలో  ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చేసిన ఏర్పాట్ల కారణంగా దాదాపు 85,000 మంది ప్రాణాలు దక్కించుకున్నారని, ఇది 2017కు ముందు ఊహించలేని విషయమని మోడీ పేర్కొన్నారు. 

సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘‘ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’’ ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 

ఈ క్రమంలో ముంబై, హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కూలీలు.. ఇకపై రాష్ట్రంలోనే ఉండి పనులు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని యూపీ అధికారులు వెల్లడించారు. 

ఉత్తర్ ప్రదేశ్ జనాభా ఐరోపాలో నాలుగు దేశాలతో సమానమని గుర్తు చేస్తూ ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ మొత్తం జనాభా కలిపితే 24 కోట్లని, కాగా అక్కడ మొత్తం 1.30 లక్షల కరోనా వైరస్ మరణాలు సంభవించగా ఉత్తర్ ప్రదేశ్‌లో 600 మరణాలు సంభవించాయని ఆయన గుర్తు చేశారు. 

ఈ నాలుగు దేశాలు అభివృద్ధి చెందిన దేశాలైనప్పటికీ, అక్కడ వైద్య సదుపాయాలకు కొరతలేనప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ కన్నా ఎక్కువ మరణాలు అక్కడ సంభవించాయని మోడీ తెలిపారు. 

అమెరికాలో కరోనా ఉధృతిని ప్రస్తావిస్తూ అమెరికాలో పరిస్థితికి సంబంధించిన వార్తలను మీరు చదివే ఉంటారని, ఆ దేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1.25 లక్షల మరణాలు సంభవించాయని మోడీ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగానే ఉత్తర్ ప్రదేశ్‌లో బిజెపియేతర ప్రభుత్వాలు పరిపాలించిన 2017 ముందు నాటి పరిస్థితిని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు ఇటువంటి సవాళ్లు ఎదురైనపుడు తప్పించుకుని పారిపోయేవని మోడీ ఎద్దేవా చేశారు. అలహాబాద్‌లో కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వ్యక్తి అలహాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. 

ఆ తొక్కిసలాటలో చోటు చేసుకున్న వేలాదిమంది మరణాలను మరుగునపరచడానికి అప్పటి ప్రధాని శతవిధాలా ప్రయత్నించారని మోడీ ఆరోపించారు. కాని ఇప్పటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం కరోనా ఉధృతిని సవాలు తీసుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని ఆయన ప్రశంసించారు.

కృషి విజాన కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల ద్వారా ఆరు జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రజలతో ముచ్చటించిన ప్రధాని మోడీ శ్రామిక్ రైళ్ల ద్వారా స్వరాష్ట్రానికి 30-35 లక్షల మంది వలస కార్మికులు తిరిగి వచ్చిన తర్వాత కూడా యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఈ విజయాలను సాధించిందని తెలిపారు. 

తన తండ్రి అంత్యక్రియలకు సైతం యోగి హాజరుకాలేదని, ఆయన అంకితభావానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని ప్రధాని ప్రశ్నించారు. సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నవారినే విజయం వరిస్తుందని, మీరు చేసిన కృషి ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకం కానున్నదని యోగిని ఉద్దేశించి మోడీ స్పష్టం చేశారు.