చైనాతో సరిహద్దు సమస్య నేపథ్యంలో.. లడఖ్‌లో భారీగా సైనిక మోహరింపు జరుగుతున్నది. ఉత్తరభారత దేశంలో ఉన్న అన్ని కంటోన్మెట్లు, ఎయిర్‌బేస్‌ల నుంచి వాస్తవాధీన రేఖ వైపు బలగాలు కదులుతున్నాయి. చంఢీఘడ్ ఎయిర్‌బేస్ నుంచి సీ-17 గ్లోబ్‌మాస్టర్ కీలకమైన కార్గోను లడఖ్‌ను మోసుకువెళ్తున్నది. 46 టన్నుల బరువున్న టీ-90 ట్యాంకులు కూడా ఆ సరిహద్దు దిశగా వెళ్తున్నాయి.
భారీ భారీ యుద్ధ గన్నులు, రేడార్లు, ఫైటర్ జెట్ విమానాలు, హెలికాప్టర్లను లడఖ్ ప్రాంతంలో భారత సైన్యం మోహరిస్తున్నది. సుమారు 45 వేల మంది సైనికులను లడఖ్‌లో మోహరించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటన తర్వాత భారత, చైనా దేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. కానీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదని స్పష్టం అవుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట చైనా తన బలగాలను మోహరిస్తూనే ఉన్నది. డీబీఓ, ఫుక్చే, న్యోమా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ మైదానాలను యాక్టివ్ చేశారు.
చైనా దిశగా ఉన్న అన్ని ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లను సంసిద్ధం చేస్తున్నారు. నేవీకి చెందిన పీ-81.. గగనతలం నుంచి చైనా కదలికలను పరిశీలిస్తున్నది. చైనాతో లడఖ్‌లో ఉన్న 1567 కిలోమీటర్ల సరిహద్దు వెంట సుమారు 65 పాయింట్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న గాల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, దీప్‌సాంగ్ ప్లేయిన్స్, పాంగాంగ్ సోతో పాటు సిక్కింలోని నాకు లా ప్రాంతంలో ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొన్నది. దాదాపు రెండు నెలల నుంచి రెండు దేశాల సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నాయి.
సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగినా.. ఎటువంటి ప్రగతి కనిపించడంలేదు. గాల్వన్ దాడిలో 20 మంది భారతీయ సైనికులు చనిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ట్యాంకులు, మిస్సైల్ యూనిట్లు, ఫైటర్ ప్లేన్స్ ను చైనా కూడా వాస్తవాధీన రేఖ వెంట మోహరిస్తున్నది. పాంగ్సాంగ్ సో వద్ద ఉన్న ఫింగర్ ఫోర్ వద్ద చైనా హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
More Stories
16 నుంచి మూడు దేశాల పర్యటనకు ప్రధాని
దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా నరేంద్ర మోదీ
జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నేడే