నితీష్ కుమార్ కు బలమైన ప్రతిపక్షం లేని బీహార్ 

నితీష్ కుమార్ కు బలమైన ప్రతిపక్షం లేని బీహార్ 
మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి బలమైన ప్రతిపక్షం అంటూ లేదని హైదరాబాద్ కేంద్రంగా గల ఎన్నికల అధ్యయన కేంద్రం ప్యూపిల్స్ పల్స్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మూడు కూటముల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాన్ని పరిశీలించింది.
బిజెపి, జెడియులతో కూడిన ఎన్డీయే; ఆర్ జె డి, కాంగ్రెస్ లతో కూడిన కూటమి; ప్రశాంత్ కిషోర్ అసదుద్దీన్ ఒవైసి,  కన్హయ్యా కుమార్, ఇతరులతో కలసి ఏర్పాటు చేయనున్న తృతీయ కూటమి. ప్రస్తుత పరిస్థితులలో అధికార కూటమికి బలమైన ప్రతిపక్షంగా ఆర్ జె డి నేతృత్వంలోని కూటమి మాత్రమే ఉండే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుత ఎన్నికలలో నితీష్ కుమార్ కూటమిని ఎదిరించే పరిస్థితులలో ఆర్ జె డి కూటమి ఉందా? 1990 నుండి బీహార్ లో ఏ పార్టీ లేదా కూటమి అయినా గట్టి పోటీ ఇవ్వడం కోసం రెండు అంశాలపై ఆధార పడి ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. తమ మద్దతు దారులపై పూర్తి అదుపు ఉండడంతో పాటు, ప్రతిపక్షం నుండి తగు సంఖ్యలో ఓట్లు పొందవలసి ఉంటుంది.
ఈ రెండు అంశాలు లేకుండా బీహార్ లో ఏ పార్టీ లేదా కూటమి గెలువపండటం లేదు. అంటే రాజకీయంగా తమకు దూరంగా ఉన్న వర్గాలు, కులాల మద్దతు ను గెల్చుకోవలసి ఉంటుంది.
ఉదాహరణకు 1990 నుండి 2005 వరకు 15 ఏళ్ళ పాటు ఓబిసి, దళిత్, ముస్లింలతో పాటు మండల్ కమీషన్ కు బద్ద వ్యతిరేకులైన రాజపుట్ ల మద్దతును గణనీయ సంఖ్యలో పొందడం ద్వారా లాలూ ప్రసాద్ యాదవ్ తన ఆధిపత్యం కొనసాగించుకో గలిగారు.
 అదే విధంగా 2005 నుండి 2010 వరకు నితీష్ నాయకత్వంలోని ఎన్డీయే ఉన్నత కులాలు, యాదవేతర ఓబిసిలు, మహాదళిత్లతో పాటు బిజెపి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ముస్లింలలోనే ఒక వర్గం మద్దతు పొందగలిగారు.
2015 అసెంబ్లీ ఎన్నికలలో సహితం లాలూతో పొత్తు ఉన్నప్పటికీ ఉన్నత కులాల మద్దతు పొందడం ద్వారా నితీష్ గెలుపొందారు. ఆర్ జె డి లో లాలూ తర్వాత రాజకీయ పరిపక్వత లోపించినా తేజశ్వి యాదవ్ వారసుడిగా నిలిచారు. తండ్రి వలే ప్రజాకర్షణ లేకపోయినప్పటికీ  మరే పార్టీలో కూడా తమ కులస్థులపై ప్రభావం చూపగల యాదవ్ నేత లేరు.
పైగా, నితీష్ – బీజేపీలకు వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ముస్లిం, యాదవ్ లు మొత్తం ఓటర్లలో 30 శాతం వరకు ఉన్నారు. అయితే గెలుపుకు కీలకమైన రాజకీయంగా విముఖంగా ఉండే వర్గాల మద్దతు పొందడంలో మాత్రం వెనుకబడి ఉన్నారు.
గతంలో వలే యాదవేతర ఓబీసీలు, ముఖ్యంగా ఇబీసీలు, మహా దళిత్ ల మద్దతు పొందలేక పోతున్నారు. ఆర్ జె డి ని ఒక కుల పార్టీగా, నేరస్తులతో సంబంధం గల పార్టీగా మాత్రమే ప్రజలు చూస్తున్నారు.
ఇతర కుల నేతలైన ముకేశ్ సాహ్ని, ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝి వంటి వారితో పొత్తు ద్వారా యాదవుల పార్టీ అనే ముద్ర పోగొట్టుకొని ప్రయత్నం చేస్తున్నా ఈ కులాలు ఒకొక్క ఎన్నికల్లో ఒకొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. 2014, 2019లలో బజెపికి, 2015లో నితీష్ కు ఓటు వేశారు. పైగా, ఈ నాయకులకు ప్రస్తుతం తమ కులస్థులలో పట్టు తప్పింది.
మరోవంక లాలూకు మద్దతు ఇచ్చిన రాజపుట్ లలో ఒక వర్గం కూడా ఇప్పుడు తేజస్వికి మద్దతు ఇవ్వడం లేదు. సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేయడం ఆ వర్గం పార్టీకి దూరమైన్నట్లు స్పష్టం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో నితీష్ కుమార్ కూటమిని ఓడించగల సత్తా ఆర్ జె డి కి లేదని ప్యూపిల్స్  పల్స్ నిర్ధారణకు వచ్చింది.