అధికారంలోకి రాగానే మాట తప్పిన జగన్  

ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన వైసీపీ అధికారంలోకి రాగానే మాట తప్పిందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. అవినీతిని నిర్మూలిస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు విచారణ చేపట్టి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని నిలదీశారు. 
 
వనరులున్న ఆంధ్ర  కరప్షన్‌, కుటుంబం, కులం, కుహనా అనే నాలుగు సమస్యలతో వెనుకబడకూడదని ఆమె ధ్వజమెత్తారు. 
కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శుక్రవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ ర్యాలీనుద్దేశించి ఢిల్లీ నుంచి ఆమె మాట్లాడారు.
 ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లాంటి వాటితో చేసుకున్న అగ్రిమెంట్లను కూడా జగన్‌ ప్రభుత్వ రద్దు చేయడంతో దేశానికి వచ్చిన ప్రాజెక్టులకు అనేక ఇబ్బందులు ఎదురైనట్లు ఆర్ధిక మంత్రి విమర్శించారు.  అనేక అంతర్జాతీయ ఒప్పందాలను జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రద్దుచేసిందని ధ్వజమెత్తారు.

కారణాలు ఏవైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలని ఆమె ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి హితవు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ రూ.2.70కే సరఫరా చేస్తోంటే.. దానికి ఆంధ్రలో యూనిట్అంటూ ‌కు 9 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటూ ఆమె ధ్వజమెత్తారు. 

ఇంత భారీ విద్యుత్‌ ధరలతో రాష్ట్రంలో పరిశ్రమలు నడపడం సాధ్యమేనా అని ఆమె రాష్ట్రప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ‘డిస్కమ్‌లు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి తప్ప ఇబ్బందులు పెట్టకూడదు. వాటికి నష్టం వస్తే కేంద్రమే భరిస్తోంది. రూ.90 వేల కోట్లు కేటాయిుంచింది. చౌకగా కరెంటు ఇవ్వాలి. ధర పెంచితే ఏ మాత్రం ఫలితం ఉండదు’ అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.936 కోట్లు కేంద్రం జమచేసిందని నిర్మల వెల్లడించారు. దేశంలోని రైతులకు రూ.30 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులకు అదనంగా కేటాయించామని పేర్కొన్నారు. పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు లేకున్నా ఇప్పుడు రుణాలిస్తున్నామని వివరించారు. 

‘దేశవ్యాప్తంగా మత్స్య సంపద యోజన కింద రూ.20 వేల కోట్లు ఇచ్చాం. మత్స్యకారుల జీవితాలు మారేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి. దేశంలోని ఎంఎ్‌సఎంఈల్లో ఏపీ 26లక్షలతో మూడో స్థానంలో ఉంది. చిరు వ్యాపారులు ముద్ర రుణాల కింద రూ.2 కోట్ల వరకు అప్పు తీసుకోవచ్చు’ అని ఆమె తెలిపారు. 

కరోనా వైర్‌సతో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదురవడంతో కేవలం ఒక్క మన రాష్ట్రానికే కేంద్రం 8,025 కోట్లు ఇచ్చిందని ఆమె చేప్పారు. 39.14 కోట్ల కిలోల ఆహార ధాన్యాలు, 2.17 కోట్ల కిలోల కందిపప్పు ఏప్రిల్‌, మే, జూన్‌లలో పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు.