తమ ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సాధికారత లక్ష్యంగా ముందుకు నడుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం రెవరండ్. జోసెఫ్ మార్ తోమా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్ ద్వారా మోడీ మాట్లాడుతూ కేరళలోని మార్ తోమా చర్చి సెయింట్ థామస్ భావజాలంతో జీసెస్ అడుగు జాడల్లో నడుస్తోందని పేర్కొన్నారు.
ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు కోసం మానవతా దృక్పథంతో పని చేస్తోందని, ఆరోగ్యం, విద్య వంటివి అందించడంలో ఎంతో చేసిందని చెప్పారు. జోసెఫ్ మార్ తన జీవితం మొత్తాన్ని సమాజంం, దేశ అభ్యున్నతి కోసం అకింతం చేశారని మోడీ అన్నారు. మహిళా సాధికారత, పేదరికాన్ని పారదోలడం కోసం ఎంతో చేశారని కొనియాడారు.
`భారత ప్రభుత్వం చేసే ప్రతి పనిని 130 కోట్ల మంది ప్రజలకు మంచి జరగాలని చేపడుతోందని, ఇందుకు రాజ్యంగమే మార్గదర్శకమని తెలిపారు. ఢిల్లీలో దర్జాగా ఆఫీసుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం లేదని, క్షేత్ర స్థాయిలో ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తోందని చెప్పారు.
దేశంలో ఎటువంటి వివక్షకు తావు లేకుండా ప్రతి పౌరుడూ సాధికారతతో ముందు సాగాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు. ఒకే దేశం – ఒకే రేషన్ కార్డుతో పేద ప్రజలు ఎక్కడున్నా రేషన్ సరుకులు తీసుకునేలా మార్పులు తెచ్చామని పేర్కొన్నారు.
జన్ ధన్ యోజన ద్వారా ప్రతి భారతీయుడికీ బ్యాంక్ అకౌంట్ ఉండేలా చేశామని, దీంతో కష్ట సమయంలో నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని మోడీ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం అనేక చర్యలు చేపట్టామని, రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామని వివరించారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత్ చాలా మెరుగుగా ఉందని, ప్రజలే ముందుండి వైరస్‌పై పోరాటాన్ని నడిపిస్తున్నారని మోదీ చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ను విజయవంతం చేసి కరోనా కంట్రోల్‌లో మంచి విజయాన్ని సాధించామని తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత జాగరూకతతో ఉండాలని ప్రధాని సూచించారు. వాస్తవానికి ముందు కన్నా ఇప్పుడే ఎక్కవ జాగ్రత్తగా ఉండాలని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, జనం ఎక్కువగా చేరే ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండడం లాంటివి ఏ మాత్రం మర్చిపోకూడదని ప్రధాని మోడీ హితవు చెప్పారు.
More Stories
కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు
పదేళ్ల తర్వాత నేడే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్