
భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు లొంగిపోయారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అవతలి వారిపై విమర్శలు చేసే ముందు మనం అధికారమలో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు
1962 యుద్ధం తర్వాత దాదాపు 45 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అది ఇప్పటికీ ఆ దేశం ఆధీనంలోనే ఉంది. గతంలో అంతటి భారీ స్థాయిలో జరిగిన దురాక్రమణను ఎప్పటికీ మరచిపోలేం అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తకుండా నాటి సంఘటనల్ని గుర్తు చేశారు.
ఇప్పుడు కొత్తగా చైనా ఏమైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా లేదా అన్నది తనకు తెలియదని, అయితే ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు మన హయాంలో ఏం జరిగిందన్నది మర్చిపోకూడదని చురకలు అంటించారు. ప్రస్తుతం గాల్వన్ ఘటనలో ఎక్కడా రక్షణ మంత్రి విఫలం అయినట్లు తనకు అనిపించలేదని కూడా స్పష్టం చేసారు.
మన బలగాలు గాల్వన్ లోయ ప్రాంతంలో మౌలిక వసతులను పెంచుతున్నాయని, రోడ్ల నిర్మాణం జరుగుతోందని, అదే సమయంలో సరిహద్దుల్లో నిత్యం పెట్రోలింగ్ వల్లే చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నాన్ని గుర్తించగలిగారని పవార్ పేర్కొన్నారు. భారత సైనికులు అలర్ట్‌గా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.
లేని పక్షంలో చైనా బలగాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలిసేది కాదని చెప్పారు. మన జవాన్లు అప్రమత్తంగా ఉండడం వల్లే చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చినప్పుడు తోపులాట, ఘర్షణలు జరిగాయని శరద్ పవార్రు గుర్తు చేశారు.
చైనానే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడుతూ, ఇందులో రక్షణ మంత్రి, భారత జవాన్ల వైఫల్యం ఎక్కడా లేదని స్పష్టం చేసారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు చెప్పారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం