భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు!

భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు!
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో వేగం తగ్గలేదని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారువుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రూబియో ఆదివారం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయని రూబియో తెలిపారు. ​
 
వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం త్వరలోనే భారత్ ను సందర్శిస్తుందని రూబియో తెలిపారు. అమెరికా, భారత్ మధ్య భాగస్వామ్యం కొనసాగాలని, ఇంకా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.​ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు ఏ దేశానికి వ్యతిరేకం కాదని రూబియో స్పష్టం చేశారు. 
 
తన భారత్ పర్యటనలో రెండో రోజైన ఆదివారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరిపారు. తన పర్యటనను “అద్భుతం”గా అభివర్ణించారు. తన తొలి అధికారిక భారత్ పర్యటన కోసం రూబియో శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 26న అంటే, మంగళవారం భారత్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. ఆదివారం మీడియా సమావేశంలో రూబియో మాట్లాడుతూ అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలలో భారత్ ఒకటి అని తెలిపారు. 
 
​అమెరికాలో భారతీయ అమెరికన్లపై జాతి వివక్ష వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రూబియో స్పందిస్తూ “నేను ఆ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా తీసుకుంటాను. ఆన్‌లైన్‌లో, ఇతర బహింగ ప్రదేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఉంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉన్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
“అలాగే, అమెరికాలోనూ మూర్ఖులు ఉన్నారు. అయితే అమెరికా అందర్నీ స్వాగతించే దేశం. ప్రపంచం నలుమూలల నుండి మా దేశానికి వచ్చే ప్రజల ద్వారా మా దేశం సుసంపన్నం అయింది” అని రూబియో తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ​విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ రూబియోతో జరిగిన సమావేశాల్లో వాణిజ్యం , ఇంధన, రక్షణ, కీలక ఖనిజాలు, ఎఐ, అణుశక్తి వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 
 
అలాగే, అమెరికా, ఇజ్రాయిల్ తో పాటు ఇరాన్, గల్ఫ్ దేశాలతో భారత్ కు సిర్థమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని జై శంకర్ స్పష్టం చేశారు.