పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నిధులను కాంగ్రెస్‌ వాడుకుంది

గాంధీ కుటుంబంపై బిజెపి నేతలు  అవినీతి ఆరోపణలకు పదును పెంచారు. వరుసగా రెండో రోజు గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరిన్ని ఆరోపణలు చేశారు.
యూపీఏ హయాంలో ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్) కు తరలించుకుపోయారని ఆరోపించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ బోర్డులో ఉన్న సోనియాగాంధీయే ఆర్‌జీఎఫ్ చైర్‌పర్సన్‌ గా కూడా వ్యవహరించారని ఆయన తెలిపారు.
దేశ ప్రజలు తమ కష్టపడి సంపాదించిన డబ్బును అవసరమైన సమయాల్లో ప్రజలకు సహాయం చేయడానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇచ్చారని, ఈనిధులను రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు మళ్లించడం మోసం మాత్రమే కాదు, దేశ ప్రజలకు మోసం చేయడం కూడా అని ఎద్దేవా చేశారు.
 
పార‌ద‌ర్శ‌క‌త గురించి ఆలోచించ‌కుండా అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు న‌డ్డా విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు విరాళం ఇచ్చిన డ‌బ్బును ఫౌండేష‌న్‌కు త‌ర‌లించ‌డం మోస‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. వివాదాస్ప‌ద మ‌త‌ప్ర‌చార‌కుడు జ‌కీర్ నాయ‌క్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిధులు సేక‌రించిన‌ట్లు ఆరోపించారు.  
ఒక కుటుంబం సంపద కారణంగా దేశం చాలా నష్టపోయిందని, కాంగ్రెస్ రాజవంశం తన సొంత ప్రయోజనం కోసం ఈ నిధులను వాడుకున్నందుకు తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు.
రాజీవ్ గాంధీ లక్ష్యాలను మరింత పెంచాలన్న ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ను 1991 జూన్ 21 న ప్రారంభించారు. విద్య, విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానం, నిరుపేద, వికలాంగుల సాధికారత కోసం ఈ ఫౌండేషన్‌ పనిచేస్తుంది. విరాళాల నుండి పొందిన మొత్తంతో ఈ సంస్థ నడుస్తుంది.
నియాగాంధీ చైర్‌పర్సన్ గా ఉన్న ఈ ఫౌండేషన్‌ ధర్మకర్తలుగా మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీ చిదంబరం ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 2005-06లో చైనా నుంచి 3 లక్షలు డాలర్లు అందుకున్నట్లు గురువారం కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు.
దీనికి ప్రతిగా, చైనాతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే అధ్యయనాన్ని ఫౌండేషన్ నిర్వహించిందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులను కూడా రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు మళ్లించారని నడ్డా ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు 2005-06, 2007-08 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధితో సహా దాతల జాబితాను నడ్డా ఈ సందర్భంగా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.