చైనా ఎంబసీలోకి గొర్రెలను తోలిన వాజపేయి

ప్రతి చిన్న విషయానికి, చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకుని యుద్ధకాంక్షతో రగిలిపోయే చైనాకు దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి ఓసారి సమయస్ఫూర్తితో పెద్ద గుణపాఠమే చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన హాస్య చతురత మొత్తం ప్రపంచ దృష్టిని ఆకట్టుకొంది. 

1965లో గొర్రెల దొంగతనం విషయమై భారత్‌-చైనా దేశాల మధ్య లేఖల యుద్ధం కొనసాగింది. సిక్కిం సరిహద్దులో తమ పౌరులకు చెందిన 800 గొర్రెలు, 59 బర్రెలను భారత సైనికులు దొంగిలించారని ఆరోపిస్తూ చైనా భారత్‌కు లేఖ రాసింది. దొంగిలించిన తమ గొర్రెలను, బర్రెలను తిరిగి ఇవ్వకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. 

ఆ సమయంలో జనసంఘ్‌ నుంచి యువ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అటల్‌ బిహారి వాజపేయికి చైనా తీరుతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆయన అప్పటికప్పుడు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంలోకి 800 గొర్రెల మందును పంపారు. గొర్రెల మెడల్లో ప్లకార్డులను కట్టి తోలారు. “మమ్మల్ని తినండి.. కానీ ప్రపంచాన్ని కాపాడండి” అని ప్లకార్డులపై రాసి ఉంది.

ప్రతిపక్షంలో ఉన్న వాజపేయి చేసిన నిరసనను చైనా అవమానంగా భావిస్తుందని పేర్కొంది. లాల్‌ బహదూర్‌శాస్త్రి ప్రభుత్వ మద్దతుతోనే ఇది జరిగిందని ఆరోపిస్తూ భారత్‌కు మరో లేఖ రాసింది. దీనిపై లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం స్పందిస్తూ ఈ ప్రదర్శనతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇది ఆకస్మిక, శాంతియుత, మంచి హాస్య వ్యక్తీకరణతో జరిగిన చర్యగా పేర్కొన్నారు. 

చైనా బెదిరింపు వ్యూహాన్ని వాజపేయి అపహాస్యం చేసిన మొత్తం ఎపిసోడ్‌ ఉద్రిక్తతలు నెలకొన్న ఆ సమయంలో ప్రజల్లో చర్చకు దారితీశాయి. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచ యుద్ధానికి చైనా తెరలేపుతోందని నిరసనకారులు విమర్శించారు. 

భారత ప్రాదేశిక భూభాగంలోని సిక్కింను స్వాధీనం చేసుకునేందుకు చైనా దుశ్చర్యలకు పాల్పడుతున్న సమయం అది. మరోవైపు కశ్మీర్‌లో పాకిస్థాన్‌ నుంచి వచ్చే చొరబాటుదారులతో పోరాడటానికి భారత్‌ తీరిక లేకుండా ఉన్న సమయం కూడా అదే. 

నలుగురు టిబెటిన్‌ నివాసులను భారత సైనికులు కిడ్నాప్‌ చేశారని చైనా తన మరో ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై భారత్‌ స్పందిస్తూ ఇతర టిబెటన్‌ శరణార్థుల మాదిరిగానే ఈ నలుగురు తమ ఇష్టానుసారం ప్రభుత్వ అనుమతి లేకుండా భారతదేశంలోకి వచ్చారని తెలిపింది. భారత్‌లో ఆశ్రయం పొందారంది. కోరుకుంటే ఎప్పుడైనా టిబెట్‌కు తిరిగి వెళ్లడానికి వారికి స్వేచ్ఛ ఉందంది పేర్కొంది.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో 1962 లాంటి మరో పాఠాన్ని భారతదేశానికి నేర్పుతామని చైనా మళ్లీ హెచ్చరించింది. అన్నట్లుగానే రెండేళ్ల తర్వాత భారత్‌కు పాఠం నేర్పేందుకని వచ్చిన చైనా తీవ్రంగా దెబ్బతిని వెనుతిరిగింది. అప్పటినుంచి ఇరుదేశాల సరిహద్దులో శాంతి, సామరస్యాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే తిరిగి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.