ప్రధాని దృష్టికి తెలుగు రాష్ట్రాల జలవివాదం!

పరస్పరం అక్రమంగా సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్మించుకొంటున్నట్లు ఆరోపణలు చేసుకొంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటికి సంబంధించిన డిపిఆర్ లు ఇవ్వమని అడిగినా ఇవ్వకుండా డాటా వేస్తూ ఉండడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీరియస్ అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిర్మిస్తోన్న ప్రాజెక్టుల డీపీఆర్ల సమస్యను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి  యూపీ సింగ్ స్పష్టం చేశారు. 

కృష్ణా, గోదావరి నదులపై 2014 జూన్ 2 తర్వాత మొదలు పెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని కోరితే రెండు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నుంచి మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుందని తేల్చిచెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. యూపీ సింగ్ ఢిల్లీ నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలసౌధ నుంచి బోర్డుల చైర్మన్లు పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్, బోర్డుల మెంబర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. డీపీఆర్లే ప్రధాన ఎజెండాగా వారి మధ్య చర్చ జరిగింది.

రెండు రాష్ట్రాలు నిర్దేశిత సమయం లోగా  డీపీఆర్లు ఇవ్వకుంటే కేంద్రమే రంగంలోకి దిగుతుందని యూపీ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలపై వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని బోర్డుల చైర్మన్లకు ఆయన సూచించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప వివాదాలకు ముగింపుపడే అవకాశం లేదని అంటూ చైర్మన్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. 

శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోవడానికి ఏపీ తలపెట్టిన సంగమేశ్వరం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవని  యూపీ సింగ్ చెప్పారు. ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే వివరాలతో విచారణకు సిద్ధం కావాలని సూచించారు.