రాజీవ్ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైనా విరాళాలు

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో దేశంలో రాజకీయాలకు అతీతంగా భారత ప్రజలు అందరు ఏక కంఠంతో చైనా విస్తరణవాదంపై విరుచుకు పడుతూ ఉంటె, కాంగ్రెస్ పార్టీ మాత్రం చైనా అనుకూల విధానాలు అనుసరిస్తూ, భారత సేనల మనోధైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. చైనా నాయకత్వంతో సోనియా గాంధీ – రాహుల్ గాంధీలకు ఉన్న ప్రత్యేక సంబంధాలే అందుకు కారణంగా వెల్లడి అవుతున్నది. 
 
కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఉన్న సమయంలో సోనియా సమక్షంలో చైనాలో రాహుల్ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక ఒప్పందం చేసుకున్న విషయం గత వారమే వెల్లడైనది. తాజాగా వారి కుటుంభంకు చెందిన రాజవి గాంధీ ట్రస్ట్ కు చైనా నిధులు సమకూరిన సంచలన అంశాన్ని 
 కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.  
 
చైనాతో కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలున్నాయని,  అందుకే ఆ పార్టీ నేతలు చైనాకు మద్దతుగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుకు ఆధారాలంటూ  రాజీవ్ గాంధీ ట్రస్ట్ కు చైనా ఎంబసీ రూ. 90 లక్షలు విరాళం ఇచ్చిన వివరాలను ఆయన బయటపెట్టారు. 
 
”సోనియా, రాహుల్ గాంధీ లు కేంద్రంపై విమర్శలు చేస్తూ చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా విరాళాలు ఇవ్వటమే ” అని మండిపడ్డారు. 
 
2005–06లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్‌ చైనాతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్‌ ప్రశ్నించారు. ఎఫ్‌టీఏతో భారత్‌ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరందని ధ్వజమెత్తారు.
 
“చైనాకు ముందు వీళ్లు భూమి ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా రూ. 90 లక్షలు విరాళంగా తీసుకున్నారు. రాజీవ్ ట్రస్ట్ అంటే అది కాంగ్రెస్ పార్టీయే. డబ్బులు విరాళాలు తీసుకునేందుకు వీరు అనుమతి తీసుకున్నారా ? ఆ డబ్బు లు తీసుకున్నట్లు ప్రభుత్వా నికి సమాచారం ఇచ్చారా ? ఇది నిబంధనలను ఉల్లంఘించడం కాదా? ” అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇలా ఉండగా,  2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్‌ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం  కుదర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రశ్నించారు.ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. డోక్లాం వివాదం సమయంలో రాహుల్‌ చైనా వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.