
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత సంస్థలు కూడబెట్టిన నిధులు గతేడాది దాదాపు 6 శాతం తగ్గి రూ.6,625 కోట్లకు (899 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు) చేరాయి. స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం భారతీయుల నుంచి స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన నిధులు వరుసగా రెండో ఏడాది కూడా తగ్గాయని, గత మూడు దశాబ్దాల్లో ఇది మూడో కనిష్ఠ స్థాయి అని స్పష్టం చేస్తున్నాయి.
2019 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయులు మొత్తం 899.46 మిలియన్ ఫ్రాంకులు కూడబెట్టారని ఎస్‌ఎన్‌బీ వెల్లడించింది. వీటిలో కస్టమర్ డిపాజిట్ల రూపేణా 550 మిలియన్ ఫ్రాంకులు (దాదాపు రూ.4 వేల కోట్లు), ఇతర బ్యాంకుల ద్వారా 88 మిలియన్ ఫ్రాంకులు (రూ.650 కోట్లు), ట్రస్టుల ద్వారా 7.4 మిలియన్ ఫ్రాంకులు (రూ.50 కోట్లు), సెక్యూరిటీలతోపాటు వివిధ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ల రూపంలో 254 మిలియన్ ఫ్రాంకులు (రూ.1,900 కోట్లు) వచ్చాయని వివరించింది.
ఇవన్నీ వివిధ బ్యాంకులు తమకు తెలియజేసిన అధికారిక గణాంకాలని, స్విట్జర్లాండ్‌లో భారతీయులు దాచిన నల్లధనం గురించి ఈ గణాంకాల్లో ప్రస్తావించలేదని ఎస్‌ఎన్‌బీ తెలిపింది. వేరే దేశాల్లోని సంస్థల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంస్థలు స్విస్ బ్యాంకుల్లో కూడబెట్టిన సొమ్ము వివరాలు కూడా ఈ గణాంకాల్లో లేవని ఎస్‌ఎన్‌బీ స్పష్టం చేసింది.
వ్యక్తులు, బ్యాంకులు, సంస్థలు సహా భారత కస్టమర్ల నుంచి స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన అన్ని రకాల నిధులను గమనంలోకి తీసుకొని ఈ గణాంకాలను రూపొందించినట్టు తెలిపింది. భారత్‌లోని స్విస్ బ్యాంకు శాఖల నుంచి వచ్చిన డిపాజిట్లు, నాన్-డిపాజిట్ల వివరాలు కూడా ఈ గణాంకాల్లో ఉన్నాయని పేర్కొన్నది.
గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు స్వల్పంగా 0.07 శాతం (దాదాపు రూ.646 కోట్లు) పెరిగినట్టు బీఐఎస్ (బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్) ఇటీవల వెల్లడించింది. ఈ గణాంకాలు మరింత విశ్వసనీయంగా ఉన్నాయని భారత అధికారులతోపాటు స్విస్ అధికారులు కూడా అంగీకరించారు. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ నాన్-బ్యాంక్ క్లయింట్లకున్న డిపాజిట్లు, రుణాలను గమనంలోకి తీసుకొని బీఐఎస్ ఈ గణాంకాలను రూపొందించింది.
2007 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా రూ.9 వేల కోట్లకుపైగా పెరిగాయని, కానీ 2017లో ఇవి 44 శాతం, 2018లో 11 శాతం తగ్గాయని బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా, భారతీయులు కూడబెట్టిన ఆస్తులను నల్లధనంగా పరిగణించలేమని, పన్నుల ఎగవేతపై భారత్ సాగిస్తున్న పోరాటానికి వారంతా మద్దతు తెలుపుతున్నారని స్విస్ అధికారులు పదేపదే చెప్తున్నారు.
పన్ను వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఆటోమ్యాటిక్ మార్గం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం 2018 నుంచి స్విట్జర్లాండ్, భారత్ మధ్య కొనసాగుతున్నది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగివున్న భారతీయుల వివరాలను ఈ మార్గం ద్వారా 2019 సెప్టెంబర్‌లో తొలిసారి భారత అధికారులకు అందజేసిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇదే పని చేయాల్సి ఉన్నది.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
ఢిల్లీ నగరంలో 5వేల మంది పాకిస్తానీలు