కొద్దిపాటి వర్షాలకే యాదాద్రిలో పగుళ్లు, లీకేజీలు 

కొద్దిపాటి వర్షాలకే యాదాద్రిలో పగుళ్లు, లీకేజీలు 

వర్షాలు మొదలవడంతోనే యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. పలుచోట్ల పగుళ్లు పట్టడంతో పాటు లీకేజీల కారణంగా వర్షపు నీరు ఆలయంలోకి చేరింది. కొద్దిపాటి వర్షాలకే ఇట్లా జరుగుతూ ఉంటె, భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన చెలరేగుతుంది. 

ముఖ్యమంత్రిగా కేసీఆర్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకై యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేసి రూ. 1200 కోట్లు కేటాయించారు. పక్కనే పెద్ద గుట్టను సేకరించడంతో పాటు ఆలయం దిగువలో దాదాపు 250 ఎకరాలను సేకరించారు.

మరో కొండపై ప్రెసిడెన్షియల్​సూట్​ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకూ రూ. 750 కోట్లను విడుదల చేశారు. ఇందులో ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వీయ పర్యవేక్షణలో నాలుగేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవలి వర్షాలతో పనుల్లో నాణ్యత లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

గతేడాది చివర్లో కురిసిన వర్షానికి పెద్దగుట్టపై నిర్మించిన రోడ్లు కూలిపోయాయి. అదే సమయంలో ప్రెసిడెన్షియల్​సూట్ నిర్మిస్తున్న కొండపై కూడా రోడ్లు కొట్టుకొనిపోయాయి. యాదాద్రి ఘాట్ రోడ్లకు సంబంధించిన మట్టి కూడా కొట్టుకుపోయింది. గత నెలలో ఇదే కొండపై నిర్మిస్తున్న ఓ భవనం స్లాబ్​ కూలి నలుగురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు.

ఇటీవల యాదగిరిగుట్టలో కురిసిన వర్షాల కారణంగా ఆలయ పునర్మిర్మాణంలో ఆటంకాలు కలుగుతున్నాయి. యాదగిరిగుట్టలో ఈ నెల 11న భారీ వర్షం కురిసింది. దీంతో కొండపై వాహనాల పూజలు చేసే చోట, పుష్కరిణి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. అదేవిధంగా బాలాలయం వద్ద మట్టి జారి ఘాట్​రోడ్డుపై పడిపోయింది.

ఈ నెల 13న కురిసిన వర్షం కారణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆలయ అంతర్భాగంలోని నిర్మాణాల్లోకి వర్షం నీరు చేరింది. అష్టభుజి, అంతర్గత, బాహ్యప్రాకార మండపాలతోపాటు అద్దాల మండపంలోకి లీకేజీల ద్వారా వర్షపు నీరు చేరింది. వైటీడీఏ ఆఫీసర్లు ఆలయాన్ని పరిశీలించినప్పటికీ లీకులు గుర్తించలేకపోయారు.

మరోవైపు ఆలయం చుట్టూరా కృష్ణశిలలతో వేసిన ఫ్లోరింగ్​కింద మట్టి కుంగిపోయింది. దీంతో బ్రహ్మోత్సవ మండపం దక్షిణం వైపున కృష్ణశిల కుంగి వర్షపు నీరు నిలిచింది.