సాయుధ బలగాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ  

సాయుధ బలగాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ  
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా గట్టిగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తూర్పు లడఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీనికి సీడీసీ జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి ఎంఎం నరవణే, నావీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా హాజరయ్యారు. 

చైనాతో సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా  రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశించారు. భూ సరిహద్దు, గగనతలం, వ్యూహాత్మక సముద్ర ప్రాంతాల్లో నిఘాను పెంచాలని సూచించారు.  ఆయుధాలను వాడకూడదన్నది ఎప్పటి నుంచో భారత్‌ అనుసరిస్తున్న విధానమని, గల్వాన్‌ ఘటన నేపథ్యంలో ఇకపై భద్రతా బలగాలు దీనికి కట్టుబడి ఉండబోవని సీనియర్‌ సైనికాధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్‌ సోమవారం రష్యా వెళ్లనున్నారు.

 చైనా బలగాల పాశవిక దాడి నేపథ్యంలో ఎల్‌ఏసీ వద్ద అనుసరించాల్సిన సైనిక నిబంధనలను భారత్‌ మార్చింది. ‘అసాధారణ పరిస్థితుల్లో’ సైనికులు తమ ఆయుధాలను వాడేందుకు అనుమతినిచ్చింది. సోమవారం నాటి ఘర్షణలో చైనా బలగాలు తమపై దాడికి దిగినప్పుడు మన జవాన్లు ఆయుధాలను వాడలేదు. ఇరుదేశాల మధ్య ఒప్పందాలను అనుసరించి, పై అధికారుల ఆదేశాల మేరకు ఆయుధాల‌ను వినియోగించలేదు’ అని సైనిక వర్గాలు తెలిపాయి.

ఇలా ఉండగా, అత్యవసరస సమయాల్లో రూ.500 కోట్ల   విలువైన అత్యాధునిక ఆయుధాలను, యుద్ధ సామగ్రిని కొనుగోలు చేసేందుకు సాయుధ బలగాలకు కేంద్రం అధికారమిచ్చింది. ఒక వేళ చైనాతో పూర్తి స్థాయి లేదా పరిమిత స్థాయి ఘర్షణ తలెత్తితే, అందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉండేదుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అదనంగా 2వేల మంది ఐటీబీపీ సిబ్బందిని చైనా సరిహద్దులకు తరలించనున్నారు.

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు రెండు దేశాలతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.

గల్వాన్‌లో ఘర్షణ ఎలా జరిగింది? శత్రుసైన్యం 5 రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మన జవాన్లు చైనా అబ్జర్వేషన్‌ పోస్ట్‌ను ఎలా తొలిగించగలిగారు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గల్వాన్‌ వద్ద చైనా శిబిరాన్ని తొలగించాల్సిందిగా భద్రతా బలగాలకు ఆదేశాలందాయి. జవాన్లు వెళ్లి ఆ శిబిరాన్ని తొలిగించాల్సిందిగా కోరారు.

చైనా సైనికులు అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించటంతో భారత జవాన్లు ఉన్నతాధికారులకు చెప్పారు. ఈసారి కర్నల్‌ సంతోష్‌బాబు నేతృత్వంలో 50 మంది వరకు జవాన్లు వెళ్లారు. అప్పటికే అక్కడ 300-350 మంది చైనా సైనికులు రాళ్లు, ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు.

భారత జవాన్లు చైనా టెంట్‌ను తొలిగించడం మొదలుపెట్టడంతో చైనా జవాన్లు విచక్షణా రహితంగా దాడికి దిగారు. హవిల్దార్‌ పళనిపై దాడిచేయడంతో అతడు నేలకొరిగాడు. దీంతో మన జవాన్ల సైతం ప్రతిదాడికి దిగారు. అటువైపు ఐదు రెట్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఏమాత్రం వెరువకుండా పోరాడారు.

మరుసటి రోజు ఆ ప్రాంతంలో పడివున్న చైనా జవాన్ల మృతదేహాలను మనవాళ్లే వారికి అప్పగించారు. మొత్తానికి అక్కడి నుంచి చైనా టెంట్‌ను తొలగించగలిగారు. అయితే ఆ ప్రాంతానికి సమీపంలోనే మళ్లీ చైనా శిబిరాన్ని ఏర్పాటుచేసింది.

గల్వాన్‌ ఘర్షణలో సుమారు 45-50 మంది వరకు చైనా సైనికులు చనిపోయి ఉండొచ్చని సైనిక వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సుమారు నాలుగు గంటలకుపైగా ఘర్షణ కొనసాగినట్లు పేర్కొన్నాయి.