అఖిలపక్ష సమావేశంలో ఒంటరిదైన సోనియా 

గాల్వాన్ సరిహద్దులో భారత, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ఒంటరిదైనది. వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పక్షాలు చైనా దురాక్రమణ ధోరణులను ఖండిస్తూ, ప్రధాని మోదీకి బాసటగా ఉంటామని హామీ ఇస్తూ, చైనాపై కఠిన వైఖరి అనుసరించాలని కోరారు.
 
 కేవలం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , వామపక్షాలు మాత్రమే చైనా ధోరణిపై ఎటువంటి విమర్శలు చేయకుండా, మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలు కురిపించడం ద్వారా దేశ ప్రజలముందు తమ విద్రోహకర ధోరణులను ప్రదర్శించుకున్నారు. 
చివరకు కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎన్సీపీ, డీఎంకే వంటి పార్టీలతో పాటు, రాజకీయంగా బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహితం సమైక్యత సందేశాన్ని వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సహితం ఈ విషయంలో మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. దేశం మంతా ఈ విషయంలో ఒక్కటే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మినహా ఒక్క పక్షం కూడా సంఘీభావంగా నిలబడలేదు. 
 
సరిహద్దుల్లో ఘర్షణలపై ప్రభుత్వం పూర్తి సమాచారం వెల్లడించటంలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. గల్వాన్‌ ఘర్షణలో నిఘావైఫల్యం ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  అసలు చైనా బలగాలు ఏ రోజు ఎల్‌ఏసీ దాటాయో కేంద్రం చెప్పాలని కోరారు. చైనా చొరబాట్లపై నిఘావర్గాల ద్వారా సమాచారం అందలేదా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
 
పైగా, జూన్ ఆరునే చైనా నాయకత్వంతో చర్చలు జరిపి ఉండాల్సిందని హితవు చెప్పారు. వాస్తవాధీన రేఖ పరిణామాలపై కేంద్రం దేశానికి విశ్వాసం కల్పించాలని సూచించిన ఆమె చైనా గురించి పరుషంగా ఒక్క మాట కూడా వాడలేదు.  
 
బీజేపీతో తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్‌థాకరే తదితరులు ప్రభుత్వానికి  పూర్తి మద్దతు ప్రకటించారు. ‘ఈ సమయంలో ప్రతికూల సందేశం వెళ్లేలా ఏమీ మాట్లాడదల్చుకోలేదు. చైనా ముందు తలవంచే ప్రసక్తే లేదు. చైనాపై భారత్‌దే పైచేయి అవుతుంది. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో మనమంతా ఒక్కటిగా ఉండాలి’ అని మమతాబెనర్జీ  స్పష్టం చేశారు.
పైగా, వ్యూహాత్మకంగా కీలకరంగాల్లో చైనా పెట్టుబడులను నిషేధించాలని  ఆమె సూచించారు. జింగ్‌పింగ్ నేత్వంలోని చైనాపై మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు.  ‘‘చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. పూర్తి నియంతృత్వ దేశం. వారి మనసులో ఏదుంటే అదే చేస్తారు” అంటూ విరుచుకు పడ్డారు.
‘మనమంతా ఒక్కటే… ఇదే మా భావన. మేం మీ వెంటే… మనమంతా ఆర్మీవెంటే. వారి కుటుంబ సభ్యులతోనే ఉన్నాం. భారత్ శాంతినే కోరుకుంటోంది. అలా అని చేతకాని తనం అని అనుకోవద్దు. చైనా స్వభావమే ద్రోహ స్వభావం. భారత్ అంటే ‘మజ్‌బూత్’. ‘మజ్‌బూర్’ ఎంత మాత్రమూ కాదు. మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైంది’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.
“దేశమంతా ఒక్కటే. పాక్, చైనా ప్రవర్తన బాగోలేదు. భారత్ చైనా డంపింగ్ యార్డ్ కాదు. చైనీస్ వస్తువులపై 300 శాతం సుంకం విధించండి’’  అని సమాజావాది పార్టీ నేత రామగోపాల్ యాదవ్ సూచించారు. చైనా వస్తువులపై 300 శాతం సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
 
“చైనా వస్తువులు భారత్ మార్కెట్‌లో పేరుకుపుపోయాయి. ఇదే పెద్ద సమస్య. అన్నీ ప్లాస్టిక్‌వే. పర్యావరణ హితంగా ఉండవు. వాటితో సంబంధం ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలూ అధికమే. అవి ఎక్కువ కాలం పాటూ ఉండవు. మనమందరమూ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందే’’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపిచ్చారు. చైనా బలగాలు వెనక్కు వెళ్లాల్సిందేనని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సహితం స్పష్టంచేశారు.  
 
అయితే వామపక్షాలు మాత్రం చైనాను పల్లెత్తు మాట అనలేదు. గతంలోని కాలం చెల్లిన పంచశీల సిద్ధాంతాన్ని అనుసరించాలని అంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సలహా ఇచ్చారు. నిఘావైఫల్యాలపై గతంలో వాజపేయి హయాంలో నియమించినట్టుగా విచారణ కమిటీని నియమిస్తారా అని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు