ఒక్క అంగుళం కూడా కొత్త‌గా చైనా ఆక్ర‌మించుకో  లేదు

భార‌త భూభాగంలో ఒక్క అంగుళం కూడా కొత్త‌గా చైనా ఆక్ర‌మించుకోలేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. మ‌న స‌రిహ‌ద్దులోని ఏ ఒక్క‌ ఆర్మీ పోస్టునూ ఆ దేశం ఆధీనంలోకి తీసుకోవ‌డం జ‌ర‌గ‌లేద‌ని కూడా వివరణ ఇచ్చారు. 
 
భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణలో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులైన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించారు. ఈ స‌మావేశం మొద‌ల‌వ‌గానే వీర జ‌వాన్ల‌కు నివాళి అర్పించారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ స‌హా మొత్తం 20 పార్టీల అధినేత‌లు హాజ‌రై త‌మ అభిప్రాయాలు, సూచ‌న‌ల‌‌ను చెప్పారు. అనంత‌రం ప్ర‌ధాని మాట్లాడుతూ  భార‌త స‌రిహ‌ద్దులేవీ ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని చేప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌శ్నించ‌ని, అడ్డుకోని ఆ దేశానికి మ‌న వీర జవాన్లు అడ్డుగా నిలిచి హెచ్చ‌రించార‌ని మోడీ కొనియాడారు. 
 
మ‌న సైనికులు 20 మంది అమ‌రులైన‌ప్ప‌టికీ, మాతృభూమిపై క‌న్నేసినోళ్ల‌కు గుణ‌పాఠం నేర్పార‌ని ప్రధాని ప్రశంసించారు. ఏ ఒక్క‌రూ భ‌ర‌త‌భూమిపై క‌న్నేసేందుకు కూడా సాహ‌సించలేనంత సామ‌ర్థ్యం మ‌న బ‌ల‌గాల సోంత‌మ‌ని భరోసా వ్యక్తం చేశారు. నింగి, నీరు, నేల.. ఏ మార్గంలోనైనా మ‌న సైనిక ద‌ళాలు దేశాన్ని కాపాడుతాయని ధీమా వ్యక్తం చేశారు.
 
ఎటుంటి శ‌త్రువునైనా ఎదిరించి, ఒకే సారి మ‌ల్టిపుల్ సెక్టార్ల‌లో దెబ్బ‌కొట్ట‌గ‌లిగే స‌త్తా మ‌న బ‌ల‌గాల సొంత‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. గ‌డిచిన కొన్నేళ్లుగా స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ కోసం అవ‌స‌ర‌మైన వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల నిర్మాణానికి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంద‌ని తెలిపారు. 
 
అలాగే త్రివిధ ద‌ళాల‌కు అవ‌స‌ర‌మైన ఫైట‌ర్ ప్లేన్స్, అడ్వాన్స్‌డ్ హెలీకాప్ట‌ర్లు, మిసైల్ డిఫెన్స్ వ్య‌వ‌స్థ‌లు స‌హా అన్ని ర‌కాల అత్యాధునిక ఆయుధాలను పెంచుకునేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. 
 
అంత‌కుముందు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ స‌రిహ‌ద్దుల్లో మ‌న బ‌ల‌గాలు పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉన్నాయ‌ని, ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనే స‌త్తా మ‌న‌కు ఉంద‌ని చెప్పారు.