టెలివిజన్ న్యూస్ ఛానల్స్ తర్వాత డిజిటల్ మీడియా ప్రాచుర్యం పొందుతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రింట్ మీడియా కుదించుకుపోతూ వస్తున్నది. అయితే కేవలం భారత దేశంలో మాత్రమే ఈ ధోరణికి అడ్డుకట్ట వేస్తూ కొద్దీ నెలల క్రితం వరకు ప్రింట్ మీడియా పెరుగుతూ వస్తున్నది. విశ్వసనీయతలో సహితం ప్రింట్ మీడియాతో మిగిలినవి పోటీ పడలేక పోతున్నాయి.
అయితే కరోనా మహమ్మారి మాత్రం భారత దేశంలో ప్రింట్ మీడియాకు కోలుకోలేని దెబ్బ కలిగిస్తున్నట్లు ఫ్రెంచ్ పత్రిక ఒకటి కధనం ప్రచురించింది. కొన్ని వార్త పత్రికలు ఇప్పటికే మూతపడగా, మరొకొన్ని ప్రముఖ పత్రికలే గాయపడుతున్నాయని తెలిపారు.
మార్చ్ 25న దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడంతో దిన పత్రికలను ముద్రించడం, ఇంటింటికి పంపించడం సమస్యగా మారింది. దిన పత్రికల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చనే సోషల్ మీడియా ప్రచారంతో చాలామంది వాటిని ఇళ్లవద్ద తీసుకోవడానికి తిరస్కరించారు.
మరోవంక ప్రకటనలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక అంచనా ప్రకారం రోజుకు 5 కోట్ల దినపత్రికలు అమ్ముడవుతూ ఉండగా, ఇప్పుడు మూడింట రెండు వంతులకు పడిపోయింది. వందలాది మంది జర్నలిస్ట్ లు ఉద్యోగాలు కోల్పోయారు లేదా వారి జీతాలు తగ్గిపోయాయి.
నిరుద్యోగులైన జర్నలిస్ట్ లకు ఒక స్వచ్చంద సంస్థ ముంబైలో ఆహార పొట్లాలను సరఫరా చేస్తూ ఉండడం పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో వెల్లడవుతుంది. ఎటువంటి రక్షణ సాధనాలు లేకుండా కరోనా సమయంలో వార్తలు సేకరించడం ప్రమాదంతో కూడుకొన్నదిగా మారింది.
“చాలాకాలం డిజిటల్ మీడియా ప్రభావాన్ని భారత దేశంలోని ప్రింట్ మీడియా ప్రతిఘటించింది. కానీ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పత్రికలు మూతపడ్డాయి. ఇక తిరిగి కోల్పోయిన పాఠకులను ఏ విధంగా సమకూర్చుకోగలమో తెలియడం లేదు” అంటూ ఒక సంపాదకుడు చెప్పారు.
మహారాష్ట్రలో, గోవాలో ప్రభుత్వమే కొంతకాలం దినపత్రికలను మూసివేయమని ఆదేశించింది. లాక్ డౌన్ కు ముందు 25 లక్షలకు పైగా ప్రతులను అమ్ముతున్న టైమ్స్ అఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ వంటి పత్రికలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఉద్యోగుల జీతాలు తగ్గించాయి. కొన్ని కార్యాలయాలను మూసివేశాయి.
రోజుకు తాము 5 లక్షల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ ఒక ఇ మెయిల్ లో ఉద్యోగులకు తెలిపింది. నెలకు 6 మిలియన్ డాలర్ల వరకు ప్రకటనల ఆదాయం కోల్పోతున్నట్లు కేరళలోని మాతృభూమి తెలిపింది.
అయితే భారత దేశంలో ఆర్ధిక వృద్ధి రేట్ తిరోగమనంలో ఉంటూ ఉండడంతో లాక్ డౌన్ కు ముందు నుండే, గత రెండేళ్లుగా వార్త పత్రికలు సంక్షోభాన్ని ఎదుర్కొంటు వస్తున్నాయి. అయితే కరోనా కాలంలో పరిస్థితులు మరింతగా దిగజారి, కుప్పకూలే పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రటకనల ఆదాయం తిరిగి ఎప్పుడు పుంజుకొంటుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
భారత దేశంలోని వార్త పత్రికలు, ఇతర పత్రికలు సాలీనా 3 బిలియన్ల డాలర్ల మేరకు ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతూ ఉండేవని ప్రపంచ వార్తాపత్రికలు, వార్త ప్రచురణల సంఘం తెలిపింది. అయితే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ లలో 75 నుండి 85 శాతం వరకు ఆదాయం కోల్పోయిన్నట్లు అంచనా వేసింది.
ఇప్పుడు ప్రధాన పత్రికల యాజమాన్యాలు సహితం డిజిటల్ మీడియాపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వయస్సు గలవారు వార్తలకోసం డిజిటల్ మీడియా వైపు చూడటం పెరుగుతున్నది. అయితే ప్రకటనల ఆదాయం పుంజుకోవడం గురించి మాత్రం ఎవ్వరు ఏమీ చెప్పలేక పోతున్నారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’