గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ అడ్డు, అదుపు లేకుండా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గురువారం గ్రేటర్‌లో 302 పాజిటివ్ కేసులు కాగా, శుక్రవారం 329 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజుల్లో 845 కేసులు నమోదయ్యాయి.
నగరంలో రోజు రోజుకు కేసుల సంఖ్యలో గణనీయ పెరుగుదల కనిపిస్తోంది. జూన్‌లో గత 19 రోజుల్లో 3 వేల కేసులు నమోదయ్యాయి. మార్చి నుంచి మే వరకు 1650కిపైగా కేసులు నమోదు కాగా, ఈ నెలలో కేసులతో కలిపి ఆ సంఖ్య 4600 దాటింది. గతంతో పోలిస్తే వర్షాలు మొదలయ్యాక వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది.
20 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరంలో మహమ్మారి విజృంభణ మరింత ఉధృతమవుతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు వైద్యులు. ఏరియా ఆస్పత్రులు, నిర్ణీత ధరకు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
గ్రేటర్‌లోని ఎంఐఎం కార్పొరేటర్ ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 33 మందికి వైరస్ సోకింది. భరత్‌నగర్ పాతబోయిన్‌పల్లిలో ఆరుగురికి కరోనా సోకింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారు లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఐపిఎస్ అధికారి ఒకరికి కరోనా సోకగా, తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరి దగ్గర పనిచేస్తున్న గన్‌మెన్‌లను, ఇతర సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ సోకిన ఇద్దరు ఐపిఎస్ అధికారుల్లో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. ఇదే సమయంలో డిజిపి కార్యాలయంలో అడిషనల్ డిజి స్థాయి అధికారి వద్ద పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకడంతో ఆయన్ను హోమ్ క్వారంటైన్ చేశారు. మొత్తం మీద 180 మంది పోలీసులకు కరోనా సోకింది.
పరిస్థితుల తీవ్రత దృష్ట్యా జూన్ 22 నుంచి జూలై 4 వరకు ప్రభుత్వ కార్యాలయాలలో 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం ఉద్యోగులు ఒక రోజు ఆఫీసుకు వస్తే, మిగతా 50 శాతం ఉద్యోగులు మరో రోజు వచ్చే వెసులుబాటు కల్పించింది. .
అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటే వద్దే ఉండాలని, ప్రతిరోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్ చేయాలని సూచించింది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగులు ఏసీలు వాడకుండా ఉంటే మంచిదని వెల్లడించింది
More Stories
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా