క్రమంగా కోలుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ 

లాక్‌డౌన్‌ నుంచి దేశం క్రమంగా నిష్క్రమిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ సాగిస్తున్న పోరాటం ‘సహకార సమాఖ్య’ విధానానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. 

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బుధవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఒకవైపు, వైద్య వసతులు, పరీక్షలు మెరుగుపరుస్తూనే, మరోవైపు ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని చెప్పారు. వైరస్‌ ముప్పు ఇంకా తొలిగిపోలేదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

గత కొద్ది రోజులుగా ఉత్పత్తి రంగంలో పలు రకాలుగా వృద్ధి కనబడుతోందని ప్రధాని చెప్పారు. లాక్‌డౌన్ దశలో విద్యుత్ వినిమయం తగ్గుతూ వచ్చిందని, అయితే పరిశ్రమలు తెరుచుకోవడంతో ఇది పెరిగిందని తెలిపారు. మే నెలలో ఎరువుల విక్రయాలు పెరిగాయని, నిజానికి గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇవి రెండింతలు అయ్యాయని, పరోక్షంగా ఇది వ్యవసాయ రంగ పనులను తెలియచేస్తోందని పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే ఈసారి వ్యవసాయ రంగం పుంజుకుందని, ఖరీఫ్ సాగు పెరిగిందని, పోయిన ఏడాదితో పోలిస్తే ఇది 12 లేదా 13 శాతం పెరిగిందని వివరించారు. ద్విచక్రవాహనాల ఉత్పత్తి డిమాండ్ పెరిగాయని, లాక్‌డౌన్ ముందుతో పోలిస్తే ఇది ఇప్పుడు 70%గా ఉందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు రిటైల్‌గా చూస్తే లాక్‌డౌన్ తొలి స్థాయికి చేరాయని చెప్పారు. 

వైరస్‌పై అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి నిర్ల క్షం వహించినా, క్రమశిక్షణ లేకపోయినా పరిస్థితి తిరిగి చిక్కుల్లో పడుతుందని హెచ్చరించారు. రైలు, రోడ్, విమానిక, సముద్ర మార్గాలు అన్నీ తెరుచుకున్నాయని, మరింతగా రీఓపెన్ జరగాల్సి ఉందని తెలిపాన్నారు. అత్యధిక జనాభా జనసాంద్రత ఉన్న భారత్ వంటి దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కరోనా వ్యాప్తి ఉందని, ఇతర దేశాలతో పోలిస్తే దీని ప్రభావం తక్కువే అని తేల్చిచెప్పారు.

భారతదేశంలో లాక్‌డౌన్, ఈ దశలో ప్రజలు కనబర్చిన క్రమశిక్షణ, సంఘటిత శక్తి గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఇప్పుడు చర్చించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. రికవరీల రేటు 50 శాతం దాటిందని, అయితే కరోనాతో ఏ ఒక్కరు మృతి చెందినా అది బాధాకరమే అవుతుందని స్పష్టం చేశారు.