జంతువుల కన్నా దారుణంగా కరోనా రోగుల పట్ల…

కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుల్లో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడుతూ… తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని మండిపడింది. 

ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఆస్పత్రుల్లో కోవిడ్ మృతదేహాల నిర్వహణ ఏమాత్రం సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కేసుల్లో అయితే వారి కర్మ కాండలకు కూడా కుటుంబీకులు హాజరు కాలేకపోతున్నారు.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 

అలాగే ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది.  హస్తినలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య 7,000 నుంచి 5,000 కు అమాంతం పడిపోయింది. ఎందుకు అలా పరీక్షల సంఖ్య అమాంతం తగ్గిపోయింది? మే మాసంతో పోల్చుకుంటే జూన్ మాసంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. ఢిల్లీలో పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి’’ అని ప్రభుత్వాన్ని సుప్రీం సూటిగా ప్రశ్నించింది.

రోనా విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు ఏమాత్రం పాటించడం లేదని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.

కాగా, కరోనా విషయంలో కేజ్రీవాల్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ కన్నెర్ర చేసింది. ఆసుపత్రుల్లో రోగులు అల్లాడిపోతున్న తరుణంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. 

ఆసుపత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు సరైన చికిత్స అందడం లేదని చెప్పారు. ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ సీఎం  కేజ్రీవాల్ స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని సంబిత్ కోరారు.