ఈ ఏడాది 100 మంది ఉగ్రవాదులు హతం

ఈ ఏడాది జనవరి నుండి జమ్మూకాశ్మీర్ లో మొత్తం 100 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కేవలం లాక్‌డౌన్‌ కాలంలో జమ్మూకశ్మీర్‌లో 68 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జూన్‌ 10 వరకు అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి.

హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు అనేక దాడులు చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ ఏడాది అత్యధికంగా 35 మంది హిజ్బుల్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. లాక్‌డౌన్‌ సమయంలోనే గత మూడు నెలల నుంచి సుమారు 25 మంది హిజ్బుల్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులను అంతమొందించారు.

చంపిన 100 మందిలో లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, జైషే మహ్మమద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా ఆపరేషన్‌లు నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను హతం చేశారు. మే నెలలో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి.. 15 మంది ఉగ్రవాదులను చంపారు. గతేడాది జూన్‌ 30వ తేదీ వరకు మొత్తం 125 మంది ఉగ్రవాదిలను హత్య చేశారు.

ఇలా ఉండగా, ఉగ్ర దాడుల కోసం కశ్మీర్‌ లోయకు ఆయుధాలు తరలించాలని ఉగ్రవాదులు చేసిన కుట్రను పంజాబ్‌ పఠాన్‌కోట్‌ పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. 

లారీలో ఆయుధాలు తరలిస్తుండగా అమృత్‌సర్‌ – జమ్మూ మార్గంలో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో ఉన్న పది గ్రనేడ్లు, ఏకే 47 తుపాకీ, 2 మ్యాగజైన్లు, 60 క్యాట్రిడ్జ్‌లను సీజ్‌ చేశారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులను షోపియాన్‌ జిల్లాకు చెందిన అమీర్‌ హుస్సేన్‌, వసీమ్‌ హసన్‌గా పోలీసులు గుర్తించారు.