అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్‌

జాతీయ సంస్థాగత ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ప్రకారం ఐఐటి మద్రాస్‌ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటి ఢిల్లీ నిలిచాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. దీంతోపాటు ఐఐటి మద్రాస్‌ను ఉత్తమ ఇంజనీరింగ్‌ కళాశాలగా ప్రకటించారు. తరువాతి స్థానాల్లో ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబయి ఉన్నాయి. 
 
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఉత్తమ జాబితాలో ఐఐఎస్సీ బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా మొదటి స్థానంలోనూ, తరువాత స్థానంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉత్తమ కళాశాలల జాబితాలో మిరాండా హౌస్‌ మొదటి స్థానంలో ఉంది. లేడీ శ్రీరామ్‌, హిందూ కళాశాలలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 
 
బిజినెస్‌ పాఠశాలల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్‌కతా ఉన్నాయి. వైద్య కళాశాలల్లో ఢిల్లీ ఎయిమ్స్‌, పిజిఐ చండీగర్‌, సిఎంసి వెల్లూర్‌ వరుసగా మొదటి మూడు ర్యాంకులూ దక్కించుకున్నాయి. 
 
ఫార్మసీ విభాగంలో ఢిల్లీలోని జామియా హమ్‌దార్డ్‌ అగ్రస్థానంలో నిలవగా, చండీగర్‌లోని పంజాబ్‌ యూనివర్శిటీ, మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. 
 
కాగా తెలంగాణకు చెందిన యూనివర్శిటీ విభాగంలో యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్‌ విభాగంలో ఐఐటి హైదరాబాద్‌ ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. లా విభాగంలో నల్సర్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. 
 
ఓవరాల్‌ విభాగంలో ఆంధ్రా యూనివర్శిటీ 36వ స్థానంలో నిలిచింది. కాలేజీ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లో లయోలా కాలేజీ, విజయవాడకి 36 ర్యాంక్‌, మెడికల్‌ విభాగంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 38 ర్యాంక్‌, ఆర్టిటెక్చర్‌ విభాగంలో ఏపి నుంచి స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడ 9వ ర్యాంకు దక్కించుకున్నాయి.