
దేశంలోనే సంచలనం రేపిన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో సాధువుల హత్య బాధ్యతలను మహారాష్ట్ర పోలీసులనుంచి సీబీఐ లేదా ఎన్‌ఐఏకు అప్పగించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించింది. ఈ మేరకు దాఖలైన అభ్యర్థనలను స్వీకరించిన జస్టిస్ అశోక్‌భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీచేసింది.
అలాగే, న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్, మహంత్ స్వామి శ్రద్ధానంద్ సరస్వతితోపాటు ఆరుగురు సాధువుల వాదనలు వినేందుకు అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా, ఈ కేసుపై స్వతంత్ర విచారణ జరపాలనే అభ్యర్థనలు ఇప్పటికే ముంబై కోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ మీరు ఏది చెప్పాలనుకున్నా తదుపరి విచారణ తేదీల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. రెండువారాల్లో తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసు విచారణను జూలై రెండో వారంలో చేపడుతామని తెలిపింది.
ముంబైలోని కండివలీ నుంచి గుజరాత్ వెళ్తున్న ఇద్దరు సాధువులతోపాటు వారి డ్రైవర్‌ను ఏప్రిల్ 16 న పాల్ఘర్ ప్రాంతంలో కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దాడి జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న పోలీసు ప్రేక్షక పాత్ర వహించాడనే ఆరోపణలున్నాయి.
ఈ విషయాన్ని ముంబై పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని, స్మారక కట్టడం నిర్మించుకునేందుకు వీలుగా సాధువుల హత్య జరిగిన స్థలాన్ని జునా అఖారా సంస్థకు అప్పగించాలని సుప్రీం కోర్టులో రెండు పిల్స్ వేర్వేరుగా దాఖలయ్యాయి.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణలో పురోగతి