16, 17వ తేదీల్లో సీఎంలతో ప్రధాని భేటీ 

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో చర్చలు జరపనున్నారు. సీఎంలను రెండు గ్రూపులుగా విభజించి ప్రధాని చర్చించనున్నారు. 
 
16వ తేదీన 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, 17వ తేదీన 15 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది. 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానితో మాట్లాడనున్నారు.
 
మరింత లాక్‌డౌనా? అన్‌లాకా? కరోనాపై ప్రస్తుత పరిస్థితిలో తీసుకోవల్సిన నిర్ణయంపై ప్రధాని వారితో మాట్లాడుతారని, వారి వైఖరిని తెలుసుకుంటారని తెలుస్తున్నది. ఇప్పటివరకూ దేశంలో లాక్‌డౌన్ పర్వాలు సాగుతూ వచ్చాయి. అయితే ఇకపై ముఖ్యమంత్రులతో జరిపే సంభాషణలలో అన్‌లాక్ లేదా లాక్‌డౌన్ నుంచి విముక్తి ఘట్టాలపై దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.
 
 దేశంలో వైరస్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి తొలిసారి 24 గంటల్లో పదివేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం,  మొత్తం కేసులు మూడు లక్షలకు (2,97,535)కు చేరువ కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
 
కాగా, మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు లక్ష మార్కును దాటాయి. తాజాగా 3,498 కేసులతో మొత్తం కేసులు 1,01,141కి చేరాయి. తాజాగా 127 మంది మృతితో మొత్తం మరణాలు 3,717కు చేరుకున్నాయి.ముంబై నగరంలోనే కరోనా కేసులు 55,451కి చేరాయి. తమిళనాడులో తాజాగా 1982 కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు 40,698కి చేరాయి.