లడఖ్ లో వెనుతిరిగిన చైనా బలగాలు 

తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. 

సోమవారం నుంచే చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన్నట్లు తెలుస్తున్నది. చైనా వెనక్కి తగ్గడంతో భారత సైనిక బలగాలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి. వివిధ ప్రదేశాలలో భారత్-చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తున్నది.  ఇరు దేశాల సైనికులు ఎదురెదురు నిలిచిన మూడు ప్రాంతాల నుంచి సైనిక బలగాలు వెనక్కి తగ్గగా, నాలుగో ప్రాంతంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

ఇలా  ఉండగా, రెండు దేశాలూ దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంబంధిత అంశాలపై  సుహృద్భావ వాతావరణంలో అర్ధవంతమైన చర్చలు జరుపుతున్నాయని చైనా తెలిపింది. రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్‌ను ఉటంకిస్తూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఈ నెల 6న తూర్పు లద్ధాఖ్‌లోని చుసుల్‌ మోల్డో ప్రాంతంలో సైనిక కమాండర్ల స్థాయిలో భారత్‌, చైనాల మధ్య 5గంటల పాటు చర్చలు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. 

సరిహద్దు సమస్యల పరిష్కారం విషయంలో తమ మధ్య భేదాల్ని వివాదాలుగా మారకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. వారాంతంలో బెటాలియన్ కమాండర్ స్థాయి, మేజర్ జనరల్‌ల స్థాయిలో చర్చలు జరుగుతాయని తెలిసింది.