ఆగష్టు 15 తర్వాతనే పాఠశాలలు

ఆగష్టు 15 తర్వాతనే పాఠశాలలు

కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆగస్టు తర్వాత పాఠశాలలు,  కళాశాలలు పునఃప్రారంభించనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఓ ఇంటర్యూలో తెలిపారు. 

దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాయని చెబుతూ ఆగస్టు 15 తర్వాత తెరవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు తెరుస్తాయన్న ప్రచారం నేపథ్యంలో ఆగస్టు తర్వాతనే పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని హెచ్‌ఆర్‌డి మంత్రి స్పష్టం చేశారు.

ఆగస్టు 15లోగా ఈ ఈఏడాదిలోని పరీక్షల ఫలితాలన్నింటిని ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు జరిగిన పరీక్షలు, ఇప్పుడు జరుగుతున్న పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సిబిఎస్‌ఇ పరీక్షలు జూలై 1 నుంచి జూలై 15 మధ్య జరగనుండగా ఐసిఎస్‌ఇ, ఐఎస్‌ఇ పరీక్షలు జూలై 1 నుంచి జూలై 12 వరకు నిర్వహించనున్నారు.

కోవిడ్ 19 ఉదృతితో అన్ని వ్యవస్థలు సంక్షౌభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థ నిర్వహణకు సరికొత్త ప్రణాళికలు తెరపైకి వస్తున్నాయి. కరోనా వైరస్ ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు వ్యాపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా పాఠశాలలు 220 పనిదినాలు 1,320 గంటల తరగతి బోధన భవిష్యత్తులో ఉండదని విద్యావేత్తలు భావిస్తున్నారు.

గత విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 100 రోజుల పని దినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే విద్యార్థికి ఇంట్లోనే ఆన్‌లైన్ బోధనతో 100 రోజులు, 600 అభ్యసన గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం రచిస్తున్నట్లు నిపుణులు పేరొక్నటున్నారు. 

కాగా మరో 20 రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా డాక్టర్లు, కౌన్సెలర్లతో విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రములు చేపట్టనున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్ సౌకర్యాలు లేని విద్యార్థులపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సూచించింది.