జమ్మూకశ్మీర్ లో జరిగిన ఆది, సోమవారాలలో జరిగిన ఎన్ కౌంటర్ లలో భద్రతా దళాలు మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. రెబన్ గ్రామంలో దాదాపు 6 గంటలు ఎదురుకాల్పులలో మరణించిన వారిలో హిజ్‌బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఫారుఖ్ అసద్ నల్లి, ఓ విదేశీయుడు ఉన్నారని రక్షణ శాఖ ప్రతినిధి కర్నల్ రాజేశ్ కాలియా చెప్పారు.
ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ, సిఆర్పిఎఫ్, సోఫియాన్ పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఉన్నత సైనికాధికారులు తెలిపారు.
అక్కడకు 12 కిమీ దూరంలో పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దశాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు, సీఆర్‌పీఎఫ్ పోలీసు బలగాలు సంయుక్తంగా కార్డన్ సర్చ్ చేపట్టాయి. దీంతో భద్రతా దళాలపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారని, ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు.
కాగా, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోనున్నదని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు చెప్పారు. ‘ఉగ్రవాద సమస్యకు ఓ పరిష్కారం కావాలని కశ్మీరీలు కోరుకుంటున్నారు. హింసాత్మక ఘటనలకు చరమగీతం పాడాలని, శాంతి విరాజిల్లాలని భావిస్తున్నారు’ అని తెలిపారు.
ఉగ్రవాదులకు మద్దతుగా నిలువడం, వారికి సహాయ సహకారాలు అందించడాన్ని బాగా తగ్గించారని చెబుతూ వీరిలో వచ్చిన ఈ మార్పు ఒక్కటి చాలు కశ్మీర్‌లో ఇక ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోనున్నదని చెప్పడానికి అని పేర్కొన్నారు.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి