చైనా వస్తువుల బహిష్కరణకు వర్తకుల పిలుపు 

కరోనా వైరస్‌ వ్యాప్తితోపాటు సరిహద్దులో దూకుడును పెంచిన చైనా పట్ల భారత్‌కు చెందిన వ్యాపార, వాణిజ్యవేత్తలతోపాటు ప్రజలు కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఆలిండియా ట్రేడర్స్‌ సమాఖ్య (సీఏఐటీ) దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమాఖ్యలో దాదాపు 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేలకు పైగా వ్యాపార సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో వివిధ చౌక వస్తువులను దిగుమతి చేస్తూ భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న చైనా వస్తువులను బహిష్కరించడం, అదే సమయంలో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటూ ప్రజలను జాగురూకులను చేసేందుకు ట్రేడర్స్‌ సమాఖ్య ప్రచారం చేపట్టనున్నది. దీని ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపినిచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం కూడా సాకారమవుతుందని భావిస్తున్నది. 

స్వదేశంలో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా గత నాలుగేండ్లుగా మంచి ఫలితాలు సాధిస్తున్నందున చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వ్యాపారుల సంఘం ప్రచారం చేస్తున్నదని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. తమ సంస్థ ప్రచారం కారణంగా చైనా దిగుమతులు 2017-18లో 76 బిలియన్‌ డాలర్ల నుంచి 70 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయని చెప్పారు. 

2021 డిసెంబర్‌ కల్లా చైనా వస్తువుల దిగుమతులను రూ.లక్ష కోట్లు తగ్గించాలని, ఈ మేరకు చైనా నుంచి దిగుమతి అవుతున్న దాదాపు 3 వేల వస్తువుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. సీఏఐటీ చేపట్టే ప్రచారం భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.