బీహార్ లో మూడింట రెండొంతుల మెజారిటీ

మరి కొద్దీ నెలల్లో బీహార్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే మూడింట రెండొంతుల ఆధిక్యత సాధింప గలదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.  బీహార్  ప్రజలను ఉద్దేశించి `బీహార్ జనసంవాద్ ర్యాలీలో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ ఈ రోజు బీహార్ లో ఎన్డీయే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం కోసం తాను ప్రసంగించడం లేదని స్పష్టం చేశారు.

కోవిడ్ -19కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం గురించి దేశ వ్యాప్తంగా ప్రజలతో అనుసంధానం కోసం బిజెపి జాతీయ స్థాయిలో “ఆత్మనిర్భర్ భారత్” ప్రచారంలో భాగంగా ఇటువంటి 75 ర్యాలీలను జరుపుతున్నట్లు చెప్పారు.

నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ గణనీయంగా అభివృద్ధి సాధిస్తున్నదని చెబుతూ లాంతర్ రాజ్ (లాలూ ప్రసాద్ యాదవ్)లో వృద్ధి రేట్ 3.9 శాతంగా ఉండగా, ప్రస్తుతం లెడ్ దీపం రాజ్ (నితీష్ కుమార్)లో 11.3 శాతంగా ఉన్నదని కొనియాడారు. అయితే ఇది రాజకీయాలు మాట్లాడుకొనే సమయం కాదని చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు అందరూ కోవిడ్ -19 వ్యతిరేక పోరాటం జరపాలని పిలుపిచ్చారు.

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు జరుపుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఈ పోరాటంలో దేశ ప్రజలను ఐక్యం కావించడం కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, కానీ దేశ ప్రజలు ప్రధానిని అనుసరిస్తున్నారని తెలిపారు.

వలస కార్మికులను క్షేమంగా సొంత ఊళ్లకు పంపించడం కోసం చేసిన ప్రయత్నాలను వివరిస్తూ కేంద్రం 1.25 కోట్ల మందిని వారి స్వస్థలాలకు పంపించినదని, వారికి అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను సమకూర్చినదని పేర్కొన్నారు.  కరోనా సంక్షోభంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ చేసిన కృషిని కొనియాడుతూ వారిద్దరికీ తాము చేసిన పనులకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పారు. 

గత 70 ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం కూడా చేపట్టడానికి సాహసింపని పలు కీలక అంశాలను ప్రధాని మోదీ తన రెండోసారి మొదటి ఏడాది పాలనలో పరిష్కరించారని అమిత్ షా గుర్తు చేశారు. భారత దేశపు రక్షణ విధానానికి నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయని తెలిపారు. 

ఇదివరలో మన సైనికులను లెక్కచేయకుండా ఎవరైనా మన సరిహద్దు దాటి వస్తుండేవారని, ఢిల్లీలో ఉండే పాలకులు పట్టించుకొనేవారు కాదని హోమ్ మంత్రి ఎద్దేవా చేశారు. “మా ప్రభుత్వ హయాంలో ఉరి, పుల్వావ సంఘటనలు జరిగాయి. మెరుపు దాడులు, వైమానిక దాడులు జరిపాము. అమెరికా, ఇజ్రాయిల్ ల తర్వాత తమ సరిహద్దులను కాపాడుకున్న దేశం ఏదైనా ఉన్నదంటే అది భారత్ అని నేడు మొత్తం ప్రపంచం గుర్తించింది” అని పేర్కొన్నారు.