శాంతియుత పరిష్కారంపై భారత్- చైనా సుముఖత 

సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి ఇరుపక్షాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ (ఎంఇఎ) అదివారం ప్రకటించింది. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు ఇరు దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్లు చుషుల్‌-మోల్దో ప్రాంతంలో శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. 

భారత్‌-చైనా మధ్య సైనిక చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, దౌత్య, సైనిక స్థాయి అధికారుల మధ్య కూడా సమావేశాలు జరగవచ్చని సూచించింది. ఇరు దేశాల మధ్య ఏర్పడుతోన్న సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయని పేర్కొంది. ధ్వైపాక్షిక బంధాల కోసం సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరమని తెలిపింది.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తవుతాయని, దీంతో 70 వార్షికోత్సవం నేపథ్యంలో.. ముందస్తు తీర్మానం మరింత అభివృద్ధికి దోహదపడుతుందని అంగీకరించాయని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలిపింది.