కరోనాకు నిధులిస్తే కేసీఆర్ మళ్లింపు 

తెలంగాణలో కరోనా కట్టడికి కేంద్రం రూ 7,000 కోట్ల నిధులిస్తే, వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటికి మళ్లించి, కరీనా మహమ్మారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎంపీ, బిజెపి నేత జి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. కేసీఆర్​కు మాయమాటలు చెప్పడం, మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.

ప్రాణహిత నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడి​నుంచి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని తన తండ్రి కాకా వెంకటస్వామి అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి రూ.37,000 కోట్లు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అందులో రూ.12,000 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులతోనే నీళ్లు వచ్చాయని చెప్పారు.

కానీ ఈ రోజు కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు వ్యయం రూ.37,000 కోట్ల నుంచి రూ లక్ష కోట్లకు పోయిందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్​ చేపట్టారని విమర్శించారు. కొండపోచమ్మకు కాళేశ్వరం జలాలంటూ కేసీఆర్​ పూజలు చేశారని, కానీ ఆ నీళ్లు ఎల్లంపల్లి నుంచి వచ్చాయని పేర్కొన్నారు.

అప్పులు చేసి కొన్ని పథకాలకు డబ్బులు ఇస్తూ ఓటు రాజకీయం చేస్తున్నారని వివేక్ దయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుని, కానీ కేసీఆర్​ మద్యం ఇస్తూ వారందరినీ తాగుబోతులను చేస్తున్నాడని విమర్శించారు.