జన్వాడలో ఫాంహౌస్ లేదు.. కేటీఆర్ 

హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్​ తనదికాదని, తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నా రని మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. నిబంధనలను  ఉల్లంఘించి కేటీఆర్​ ఫామ్ హౌస్ కట్టుకున్నారంటూ కాంగ్రెస్​ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించి తనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్​ ట్వీట్ చేశారు.
 తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్‌ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ‘‘ఓ కాం గ్రెస్ నాయకుడు నాపై ఎన్జీటీలో కేసు వేయడం ఉద్దేశపూర్వకమే. గతంలో చెప్పినట్లుగా ఆ ఫామ్ హౌస్ నాది కాదు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. సరైన న్యాయ సలహాలు తీసుకొని నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు.
 
రేవంత్ రెడ్డి  చేసిన ఫిర్యా దు మేరకు శనివారం జన్వాడ ఫామ్ హౌజ్ వ్యవహారంలో ఎన్‌జిటి తనకు నోటీసులు జారీచేసిందని తెలిపారు. అది తన ఆస్తి కాదని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారికి న్యాయపరంగా సలహా తీసుకొని సమాధానం ఇవ్వనున్నట్లు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు.
 
జన్వాడ ఫాంహౌజ్ వ్యవహారంలో కెటిఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వప్రధానకార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు, హెచ్‌ఎండిఏ, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ,హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ మేనేజ్ మెంట్‌కు ఎన్‌జిటి నోటీసులు జారీ చేసింది.
 
కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ఫిటిషన్‌పై ఎన్‌జిటి న్యాయ సభ్యులు జస్టీస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఈ నోటీసులు జారీ చేసింది. 
 
మరోవంక,  అక్రమ నిర్మాణాల అనుమతుల అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి, జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్, హెచ్‌ఎండిఏ, రంగారెడ్డి జిల్లాకలెక్టర్ సభ్యులుగా ఉంటారు.