`రాజ్ పథ్’ను ఇక ‘కర్తవ్య పథ్’గా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ 

దేశ రాజధానిలో వందేళ్ల పైగా చరిత్ర ఉన్న మార్గం, ఓ యాభై ఏళ్లు ‘కింగ్స్‌ వే’గా బ్రిటిష్‌ వారి కాలం నాటి పేరుతో కొనసాగగా, 60 ఏళ్ల నుంచి రాజరిక ఆనవాళ్లున్న పేరుగా కనిపించే ‘రాజ్‌పథ్‌’గా కొనసాగుతోంది. కానీ, ఇకపై అది అందరికీ కర్తవ్యాన్ని గుర్తు చేసే ‘కర్తవ్య పథ్‌’గా మారబోతోంది. 

ఢిల్లీలో రైసీనా హిల్స్‌పై రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న రాజ్‌పథ్‌ కర్తవ్య పథ్‌గా అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఈ అత్యాధునిక మార్గాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. 

ఈ చర్య లు అమృత కాలం లో నూతన భారత్ కోసం ప్రధాన మంత్రి ఉద్భోదించిన ‘పాంచ్ ప్రణ్’ (అయిదు ప్రతిజ్ఞ‌ ల) లోని రెండో ప్రణ్ అయినటువంటి ‘వలసవాద మనస్తత్వం తాలూకు ఏ విధమైన జాడ ను అయినా సరే, తొలగించాలి’ అనే ప్రతిన కు అనుగుణం గా ఉన్నాయి.

ఈ ప్రాంతాలలో సార్వజనిక స్నానాల గదులు, తాగునీరు, వీధి సరంజామా, వాహనాలను నిలిపి ఉంచడం కోసం తగినంత జాగా లేకపోవడం వంటి కనీస సౌకర్యాలు లేవు. అంతేకాదు, నిర్ధిష్టమైన చిహ్నాలు లోపించడం, చాలినంత జలం అందుబాటులో లేకుండా పోవడం, అస్తవ్యస్తమైన పార్కింగ్ ల వంటివి సైతం సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీనికి తోడు, గణతంత్ర దిన కవాతును, ఇతర జాతీయ కార్యక్రమాలను ప్రజల రాక పోకలకు సాధ్యమైనంత తక్కువ ఆంక్షలతో నిర్వహించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. 

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పునరభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అదే కాలంలో భవన నిర్మాణ పరమైన సమగ్రతను విచ్ఛిన్నం చేయకుండా తగిన జాగ్రతలను కూడా తీసుకున్నారు. సుందరీకరణకు తావు ఇచ్చిన ప్రకృతి చిత్రాలు, నడక దారులతో దిద్దితీర్చిన పచ్చిక బయళ్ళు, సరికొత్తగా జతపరచిన హరిత ప్రదేశాలు, మరమ్మతులు చేసిన కాలవలు, సరికొత్త సదుపాయాలతో నిర్మించిన భవనాలు, మెరుగు పరచినటువంటి సైన్ బోర్డులు, వెండింగ్ కియోస్క్ లు ‘కర్తవ్య పథ్’ లో కొలువుదీరనున్నాయి. 

వీటికి అదనంగా పాదచారుల కోసం కొత్తగా నిర్మించిన అండర్ పాస్ లు, మెరుగుపరచిన వాహనాల నిలుపుదల జాగాలు, నూతన ఎగ్జిబిషన్ ప్యానల్స్, ఇంకా అప్ గ్రేడెడ్ నైట్ లైటింగ్ ల వంటివి ఈ ప్రాంతాలను చూడటానికి వచ్చే ప్రజలకు శ్రేష్ఠమైన అనుభూతిని కలుగజేయనున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, వరద జలాల నిర్వహణ, ఒకసారి ఉపయోగించిన జలాల ప్రక్షాళనం, వర్షపు జలం ఇంకిపోయేందుకు తవ్విన గుంతలు, జల సంరక్షణ, శక్తిని ఆదా చేయగల దీపాల వ్యవస్థలు కూడా దీనిలో భాగంగా ఉన్నాయి.

భారత స్వాతంత్య్ర సమర స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమైన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 28 అడుగుల విగ్రహం మరింత ఆకర్షణగా నిలవనుంది. ఈ ఏడాది ఆరంభం లో పరాక్రమ్ దివస్ (జనవరి 23) నాడు ఏ చోటున అయితే నేతాజీ హోలోగ్రామ్ స్టాచ్యూను ప్రధాని ఆవిష్కరించారో, అదే స్థలంలో నెలకొల్పారు. 

నల్లసేనపు రాయి (గ్రానైట్)తో తయారు చేసిన ఈ విగ్రహం దేశ స్వాతంత్ర్య పోరాటానికి నేతాజీ అందించినటువంటి బ్రహ్మాండమైన తోడ్పుటుకు గాను ఒక సముచితమైన శ్రద్ధాంజలిగా ఉంది. ఈ విగ్రహం నేతాజీకి దేశ ప్రజల రుణగ్రస్తత తాలూకు ప్రతీకగా నిలవబోతున్నది. అరుణ్ యోగిరాజ్ ప్రధాన శిల్పకారునిగా ఉండగా 28 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని ఏకశిలా గ్రానైట్ నుండి చెక్కారు.  ఈ విగ్రహం 65 మెట్రిక్ టన్నుల బరువు తో ఉంది.

 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య పథ్‌ మార్గం రూపురేఖలను సమూలంగా మార్చారు. ఇండియా గేట్‌ వద్ద సెంట్రల్‌ పబ్లిక్‌ వర్స్క్‌ విభాగం ఐదు వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదాంట్లో 40 మంది దుకాణదారులను అనుమతిస్తారు. ఒక్కోటి 8 దుకాణాలున్న 2 బ్లాకులకు కూడా ఆమోద ముద్ర వేసింది. కొన్ని రాష్ట్రాలు ఆహారశాలలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. 

సాధారణ ప్రజలకు శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, రాజ్‌పథ్‌ పేరు మార్పునకు న్యూఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీఎంసీ) బుధవారం నాటి ప్రత్యేక సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి తగినట్లు కర్తవ్య పథ్‌ మార్గంలోని నేమ్‌ బోర్డులను మార్చనున్నారు.  

బ్రిటీష్‌ హయాం కట్టడాల తొలగింపులో భాగంగా మోదీ ప్రభుత్వం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో ముక్కోణ ఆకృతి పార్లమెంటు భవనం, ఉప రాష్ట్రపతి, ప్రధాని ని వాసం, పీఎంవో, సెక్రటేరియెట్‌, రాజ్‌పథ్‌ (కర్తవ్యపథ్‌) పునరుద్ధరణ ఉన్నాయి. 

రాజ్‌పథ్‌ నుంచి కర్తవ్యపథ్‌గా మారే క్రమంలో మొత్తం 19 ఎకరాల కెనాల్‌ ఏరియాను పునరుద్ధరించారు. నీటి శుద్ధికి ఏరేటర్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 16 బ్రిడ్జిలున్నాయి. కృషి భవన్‌, వాణిజ్య భవన్‌ వద్ద ఉన్న రెండు కాల్వలపై త్వరలో బోటింగ్‌ను అనుమతించనున్నారు. నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు. 

సందర్శకులు కూర్చునేందుకు 400 పైగా బెంచీలను ఏర్పాటు చేశారు. 101 ఎకరాల్లో ‘‘లాన్‌’’లను అభివృద్ధి చేశారు. కర్తవ్య పథ్‌ సహా 3.9 లక్షల చదరపు మీటర్ల మేర పచ్చదనాన్ని పెంపొందించారు.  1,125 వాహనాలను నిలిపేలా పార్కింగ్‌ ప్రదేశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రఖ్యాత ఇండియా గేట్‌ వద్ద 35 బస్సులను నిలిపేందుకు అవకాశం కలగనుంది.