కేసీఆర్ ప్రభుత్వం ఫై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు

కేసీఆర్ ప్రభుత్వం ఫై మరోసారి గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్  నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా, గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని ఆమె స్పష్టం చేశారు. 
 
తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజభవన్ లో గవర్నర్ మాట్లాడుతూ తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే, తానేమీ తక్కువ కాదని చెప్పారు. గవర్నర్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె  మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పని తాను కొనసాగిస్తానని గవర్నర్  స్పష్టం చేశారు.
 
 తెలంగాణ సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.  నిద్రపోయేవాళ్లని లేపొచ్చు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లని లేపలేమని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రంతో బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని ఆమె హితవు చెప్పారు. 
“గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు” అని డా. తమిళసై స్పష్టం చేశారు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారని అంటూ ఎట్ హోం వస్తున్నానని సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం మంచి పద్దతేనా? అని ఆమె ప్రశ్నించారు.  రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

తాను  ప్రజలను కలవాలనుకున్న ప్రతిసారి ఏదొక అడ్డంకి ఎదురవుతోంది గవర్నర్ వాపోయారు.  మేడారం జాతరకు వెళ్తానంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయలేదని ఆమె గుర్తు చేశారు.చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై గుర్తు చేశారు. 

ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటని ఆమె అడిగారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని చెబుతూ  ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని ఆమె చెప్పారు. 

ఈ మూడేళ్లలో రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా తీర్చిదిద్ది ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెబుతూ ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించా నాని,ఎన్నో యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లో పర్యటించి సమస్యలు తెలుుసుకున్నానని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెతలు చూసి చలించిపోయానని చెబుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నర్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీస స్పందన లేదని ఆమె మండిపడ్డారు.

రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచి పెట్టామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజలు రాజ్ భవన్ కు ఎందుకొస్తారని ప్రశ్నించారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి మహిళల సమస్యలను తెలుసుకున్నాం అని చెప్పిన ఆమె, వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మహిళను అవమానించారన్నది తెలంగాణ చరిత్రలో ఉండకూడదని తన అభిప్రాయమని తెలిపారు.